Saturday, November 23, 2024

కాలిబాట భ‌క్తుల ల‌గేజీకి ఇక ‘క్యూఆర్’ కోడ్ …టిటిడి ఈవో

తిరుమ‌ల – శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు త‌మ ల‌గేజిని, మొబైల్ ఫోన్ల‌ను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్ర‌క్రియ‌ను వేగంగా, సుల‌భంగా చేప‌ట్టేందుకు డిజిటలైజేషన్, ఆటోమేషన్ ద్వారా నూత‌నంగా బాలాజి బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్నామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌తో క‌లిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల‌ను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవ‌డం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని భావించి కొంద‌రు భ‌క్తులు త‌మ వెంట ఫోన్ల‌ను శ్రీ‌వారి ఆల‌యంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌స్తుత విధానంలో ల‌గేజి గానీ, మొబైల్ ఫోన్లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను డిపాజిట్ చేస్తే ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా సుల‌భంగా తిరిగి పొంద‌వ‌చ్చ‌న్నారు. నూత‌న విధానంలో భక్తులు లగేజి కౌంటర్ వద్దకు చేరుకోగానే వారి వద్ద ఉన్న దర్శన టికెట్ ను స్కాన్ చేసి వాటి వివరాలు ఎలక్ట్రానిక్ డివైస్ లో ఆటోమేటిక్ గా నిక్షిప్తం చేయడం జరుగుతుంద‌న్నారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్ కు ఆర్ఎఫ్ఐడి నిక్షిప్తమైన ట్యాగ్ ను టైప్ క్లిప్ ద్వారా జతపరిచి ఆటోమేటిక్ జనరేటెడ్ క్యూఆర్ కోడ్ రసీదును ఇస్తార‌ని చెప్పారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ సమయంలో దర్శనటికెట్, ఆధార్, భక్తుల వివరాలు సేకరిస్తార‌ని వివ‌రించారు. ఆ తరువాత వారి మొబైల్ ను భద్రంగా పౌచ్‌లో ఉంచి వాటిని క్యూఆర్ కోడ్‌కు అనుసంధానం చేసి భక్తులకు రసీదు అందజేస్తార‌ని తెలిపారు.

లగేజీ వాహనాలకు జిపిఎస్ అమర్చడం వల్ల భక్తులకు వారి లగేజ్ చేరు సమయం మెసేజ్ రూపంలో అందుతుంద‌న్నారు. అదేవిధంగా లగేజీ కౌంటర్ బయట ఉన్న డిస్ ప్లే కియోస్కుల ద్వారా రసీదులను స్కాన్ చేస్తే లగేజి చేరినదో లేదో తెలియజేస్తుంద‌ని చెప్పారు. వాహనం ద్వారా లగేజీ తిరిగిచ్చు కేంద్రాలకు లగేజీ చేరుకోగానే ట్రాలీ సహాయంతో కలర్ కోడింగ్ విధానంతో కౌంటర్లకు పంపుతార‌ని వివ‌రించారు. భక్తుల ర‌సీదును ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా స్కాన్ చేయడంతో వారి మొబైల్, లగేజీ భద్రపరిచిన సెల్ఫ్ రాక్ నెంబర్ తెలుస్తుంద‌ని, తద్వారా సులభంగా లగేజి పొందవచ్చ‌ని తెలిపారు.

నూత‌న విధానం ఒక నెల నుండి అమ‌ల‌వుతోంద‌ని, ప్రతిరోజు 60 వేల మొబైల్ ఫోన్లు, 40 వేలకు పైగా బ్యాగులను డిపాజిట్, డెలివరీ చేయడం జరుగుతోంద‌ని వివ‌రించారు. ప్రస్తుత విధానంలో 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఈ ప్రక్రియ జరుగుతోంద‌న్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, సర్వదర్శనం, సుపథం, శ్రీవారి మెట్టు, అలిపిరి వద్ద డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అదేవిధంగా కామన్ లగేజ్ కేంద్రాల వద్ద 20 కౌంటర్లు, జిఎన్సి వద్ద 6 కౌంటర్లు, టీబీసీ వద్ద 2 లగేజీ తిరిగి ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

- Advertisement -

సివిఎస్వో శ్రీ న‌రసింహ కిషోర్ మాట్లాడుతూ ఈ నూత‌న విధానంలో సాఫ్ట్‌వేర్‌ కోసం బెంగ‌ళూరుకు చెందిన దాత వేణుగోపాల్ దాదాపు ఒక కోటి రూపాయ‌లు, హైద‌రాబాద్‌కు చెందిన ట్రాక్ ఇట్ సంస్థ సిఈవో వేదాంతం సోమ‌శేఖ‌ర్ రూ.17 ల‌క్ష‌లు, హార్డ్‌వేర్ కోసం చెన్నైకి చెందిన చార్లెస్ మార్టిన్ రూ.2 కోట్లు విరాళంగా అందించిన‌ట్టు వెల్ల‌డించారు. ల‌గేజి, మొబైళ్ల డిపాజిట్‌, డెలివ‌రీని ఒకే చోట చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

జిఎన్‌సి ల‌గేజ్ కౌంట‌ర్ ప‌రిశీల‌న‌…
మీడియా స‌మావేశం అనంత‌రం సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద గ‌ల ల‌గేజి డిపాజిట్ కౌంట‌ర్‌ను ప‌రిశీలించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కియోస్క్‌లో భ‌క్తులు ర‌సీదును స్కాన్ చేసి ల‌గేజి ఎక్క‌డుందో అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ల‌గేజి డిపాజిట్ చేయ‌డం, బ్యాగుల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం, తిరిగి అందించ‌డం త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. ఇక్క‌డ స‌మాచార కేంద్రం ఏర్పాటు చేశామ‌ని, నూత‌న విధానంలో సందేహాలుంటే నివృత్తి చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

మీడియా స‌మావేశంలో విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధ‌ర్‌రావు, ఇత‌ర నిఘా, భ‌ద్ర‌తా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement