తిరుమల, ప్రభన్యూస్ : శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు అందించిన విరాళాలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈసందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఆలయాల నిర్మాణంకు, దళారి వ్యవస్థని అరికట్టడానికి శ్రీవాణి ట్రస్ట్ లో దర్శన విధానాన్ని ప్రారంభించామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చెయ్యడంతో పాటు, దళారుల పై 214 కేసులు నమోదు చేసామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు ఇచ్చిన విరాళాలకు టిక్కేట్లతో పాటు రసీదు ఇస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 861 కోట్లు విరాళాలు అందితే….603 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు చెయ్యగా, వివిధ బ్యాంకుల అకౌంట్లో రూ.139 కోట్ల నిధులు వచ్చాయన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్ల పై రూ.36 కోట్లు వడ్డి వస్తే.. ఆలయాల నిర్మాణంకు రూ.120 కోట్లు వ్యయం చేశామన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 127 పూరాతన ఆలయాల పున:నిర్మాణం చేశామన్నారు. విటికి రూ.139 కోట్లు కేటాయింపు చేశామన్నారు. 2273 ఆలయాలు, గోశాలలు, భజన మందిరాల నిర్మాణంకు రూ.227 కోట్లు కేటాయించామన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1953 ఆలయాలు…. సమ్రస్తా పౌండేషన్ ద్వారా 320 ఆలయాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ… ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. రాజకీయ ఆరోపణలు తప్పా, ఇప్పటి వరకు ఒక్క భక్తుడు కూడా విరాళాలపై ఆరోపణలు చెయ్యలేదన్నారు. టీటీడీ పై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.