తిరుమల, ప్రభన్యూస్ : కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించనుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శన మాత్రమే ఉంటుందని, అన్ని రకాల ప్రవిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పి పరమేశ్వర్‌రెడ్డి ఇతర టీటీడీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1 న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణరథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వజా రోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ ప్రారంభమవుతుందని, మిగతా రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ దర్శనాలు, వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామన్నారు.
కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందని వివరించారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు భఫర్ స్టాక్ ఉంచుతామన్నారు. భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నితంత్రణ ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు సేలందించేందుకు 3,500 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తున్నామని, ఫోటో ఎగ్జ్ మిషన్, మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని, 5 వేల మంది పారిశుధ్య కార్మికులను అదనంగా ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో స్పెషల్ డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని, నిర్దేశిత ప్రాంతాల్లో ప్ర థమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులకు రవాణాపరంగా ఇబ్బందులు లేకుండా ఏపిఎస్ ఆర్టిసి ద్వారా తదినన్ని బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు వీలుగా గరుడసేవ నాడు పూర్తిగా మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంట వరకు తిరుమల-తిరుపతి ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహన రాక పోకలను నిషేధిస్తామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దర్శించే వారికి వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విభిన్న కళారూపాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం తరపున బ్రహ్మోత్సవాల నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తిరుపతి జిల్లా ఎస్పి పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత మాడవీధుల్లో బ్రహ్మోత్సవ వాహనసేవలు జరగనుండడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా భద్రతా పరంగా ఎలాంటి రాజీకి తావులేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేపడతామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.