తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్టు భావిస్తున్న చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో భూమన పరిశీలించారు. జూన్ 22న ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై తితిదే ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందన్నారు. అటవీ, పోలీస్, తితిదే అధికారులతో చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే తితిదే ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అటవీ సంరక్షణ చట్టాలు సమర్థంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే తితిదేకి ముఖ్యమన్నారు. బాలిక కనిపించడం లేదన్న సమాచారం అందిన వెంటనే తితిదే అటవీ, పోలీస్, విజిలెన్స్, ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అడవిలో గాలింపు చేపట్టారని తెలిపారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాలిక కుటుంబాన్ని తితిదే తరపున ఆదుకుంటామని చెప్పారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను పక్కకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు