Tuesday, November 19, 2024

తేల‌ని టిఎస్ఆర్టీసీతో పంచాయితి…

అమరావతి, ఆంధ్రప్రభ: ఒక్క తెలంగాణ మినహా పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్యకు సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల రవాణా సంస్థలు బస్సులు నడిపేందుకు ముందుకొచ్చాయి. గతంలోనే తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణాతో అంతరాష్ట్ర సర్వీసుల సమస్య పరిష్కారం కాగా..గత డిసెంబర్‌లో ఒడిశా రాష్ట్ర రవాణా సంస్థ కూడా ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులతో ఒప్పందం చేసుకుంది. మూడు రోజుల కిందట అదనపు కిలో మీటర్లు బస్సులు నడిపేందుకు కర్నాటక ఉన్నతాధికారులు వచ్చి అదనంగా అంతరాష్ట్ర సర్వీసుల నిర్వహణకు ఒప్పందం చేసుకొని వెళ్లారు. కొత్త ఒప్పందం ప్రకారం కర్నాటకలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు 69,284 కిలో మీటర్లలో 327 అదనపు బస్సులు నడపబోతుండగా..ఏపీ భూభాగంలో కర్నాటక రవాణా సంస్థ బస్సులు 69,372 కిలో మీటర్లలో 496 బస్సులు నడపనుంది. అన్ని రవాణా సంస్థలు ముందుకొస్తున్నప్పటికీ..తెలంగాణ ఆర్టీసీ అధికా రులు మాత్రం ముందుకు రావడం లేదని అధికారులు చెపుతున్నారు. కోవిడ్‌ కు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు లక్షా 65వేల కిలో మీటర్ల పరిధిలో తిరిగేవి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండటంతో..అంతకంటే కిలో మీటర్లు, సర్వీసుల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే కోవిడ్‌-19 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్‌ తదనంతర పరిణామాల నేపధ్యంలో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు సర్వీసులపై టీఎస్‌ఆర్టీసీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓ వైపు కోవిడ్‌ ఆంక్షలు ఎత్తేసి ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్న తరుణంలో నిర్థిష్టమైన ఒప్పందం చేసుకుంటే తప్ప తెలంగాణ భూభాగంలోకి బస్సులను అనుమతించబోమంటూ అక్కడి అధికారులు ఖరాఖండిగా తేల్చేశారు.

పలు దఫాలుగా చర్చలు
కోవిడ్‌ తదనంతరం సాధారణ పరిస్థితితులు నెలకొంటున్న తరుణంలో టీఎస్‌ అధికారులు బస్సులపై ఆంక్షలు విధించడంతో అధి కారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు అధికారుల స్థాయిలో చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పలుమార్లు హైదరాబాద్‌ వెళ్లి చర్చలు జరిపినా సమ స్య కొలిక్కి రాలేదు. రోజు రోజుకూ పరిస్థితి జఠిలమవు తున్న తరుణం లో అప్పటి రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రా మయ్య(నాని) వెళ్లి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌తో చర్చలు జరిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ అధికారుల స్థాయిలో ఒప్పందాలు కొంత జాప్యమయ్యాయి.
ఏపీ ప్రభుత్వ చొరవ, అధికారుల కృషితో ఎట్టకేలకు తెలంగాణ అధికారులు అంతరాష్ట్ర ఒప్పందానికి అంగీకరించారు. అంతకు ముందున్న కిలో మీటర్లను పక్కన బెట్టి ఏపీ, తెలంగాణ భూభాగాల్లో రెండు రాష్ట్రాల బస్సులను లక్షా 2వేలకే పరిమితం చేశారు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు తెలంగాణ భూభాగంపై లక్షా రెండు వేల కిలో మీటర్ల పరిధిలో 560 వరకు బస్సులు నడుపుతోంది. ఇదే దామాషాలో ఏపీ భూభాగంపై టీఎస్‌ ఆర్టీసీ సంస్థకు చెందిన 830 వరకు బస్సులు నడుస్తున్నాయి. గతంతో పోల్చితే కిలో మీటర్లు, బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రైవేటు ఆపరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. తప్పని సరి స్థితిలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రత్యమ్నాయ మర్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

డిమాండ్‌ ఉన్నా..

రోజు రోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య నేపధ్యంలో సర్వీసుల పెంపుపై పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు టీఎస్‌ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పలుమార్లు ఇదే అంశంపై అక్కడి అధికారులతో చర్చించారు. పరస్పర ఆమోదం తో కిలో మీటర్లు పెంచుకొని బస్సుల సంఖ్య పెంచుదామం టూ పలు మార్లు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు అక్కడి అధికారుల నుంచి సానుకూల స్పందన లేదని చెపుతున్నారు. కనీసం గతంలో ఉన్న కిలో మీటర్లనైనా పునరుద్ధరించేందుకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వపరంగా చేసిన ప్రయ త్నాలు సైతం ఫలించ లేదు. అన్ని రాష్ట్రాల నుంచి సానుకూలత వ్యక్తమై న నేపధ్యం లో మరోసారి టీఎస్‌ ఆర్టీసీ అధికారులతో సమస్య పరిష్కా రంపై చర్చించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement