గుంటూరు, : విద్యార్థులు తమలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలకు నిత్యం పదును పెడుతూ ఉండాలనీ, అప్పుడే అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో నెలకొన్న పోటీతత్వాన్ని సమర్థంగా ఎదుర్కోగలరని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రతి రోజూ కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారు. శనివారం జరిగిన ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవానికి డాక్టర్ తమిళి సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవ వేదికపై పట్టభద్రులైన విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలనుద్దేశించి ప్రసంగించారు. భావి భారతావనికి క్రమ శిక్షణ గల విద్యార్థులను అందిస్తోన్న అధ్యాపకులకు తాను మొట్టమొదటి నమస్కారాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని చూశాక తాను ఏపీలో ఉన్నానా, లేక ఫారిన్ కంట్రీలో ఉన్నానా అన్న సందేహానికి గురయ్యానన్నారు. యూనివర్సిటీ భవనాలను చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైననట్లు పేర్కొన్నారు. తాను తెలంగాణలో 14 యూనివర్సిటీలకు చాన్సలర్ ననీ, ఎక్కడా ఈ తరహా అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియంను చూడలేదన్నారు.
విద్యార్థుల ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాలు ప్రధానమని పేర్కొంటూ, వర్సిటీ యాజమాన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అవకాశాలను సృష్టించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కరోనా వ్యాప్తి సమయంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యాక్సినేషన్ టెస్ట్ డ్రైవ్ కు ఎంతో సహకారం అందించిందనీ, ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు కొత్త లక్ష్యాలతో, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు.
వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొ ఛాన్సలర్ డాక్టర్ సత్యనారాయణన్ ఇకపై ఛాన్సలర్ గా కొనసాగుతారని పేర్కొన్నారు. విద్యార్థులు జనరల్ నాలెడ్జిని కూడా పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఉజ్వల జీవన విధానానికి, దేశ ప్రగతికి దోహదపడే కలలను సాకారం చేసుకోవాలని డాక్టర్ సత్యనారాయణన్ పేర్కొన్నారు.
అనంతరం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన సేవలు అందించిన డాక్టర్ అశుతోష్ శర్మకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ముఖ్య అతిథి, గౌరవ అధిథులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవం ప్రారంభం సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్కుమార్ ఆరోరా స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథి ప్రసంగం ముగిశాక 883 మంది విద్యార్థులకు డిగ్రీలు, బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. గవర్నర్ రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ అరిఫ్ లు యూనివర్సిటీకి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రేమకుమార్, డీన్లు డాక్టర్ వినాయక్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ విష్ణుపథ్, డాక్టర్ రంజిత్ థాపా తదితరులు పాల్గొన్నారు.