Sunday, November 17, 2024

TS: మీదికి మిరప తోట.. లోపలేమో పాడు పని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తోటల మాటున గుట్టుచప్పుడు కాకుండా సాగవుతున్న గంజాయి పంటలపై అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఇన్నాళ్ళు గంజాయి సాగుపై చూసీచూడనట్లు ఊరుకున్న అధికారులు ఇటీవల సిఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశానుసారం గంజాయి సాగు అవుతున్న తోటల వద్దకు వెళ్ళి గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. సంబంధిత సాగుదారుడిపై కేసులు నమోదు చేస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాధారణ పంటలు సాగు చేసిన పెద్దగా ఆదాయం లేదని భావించిన రైతులు తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా అంత ర్‌పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు.

ప్రధానంగా మిరప, పత్తి చేలలో అంతర్‌ పంటగా గంజాయి సాగువుతోంది. తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతుందనే సమాచారంతో డ్రోన్ల సహయంతో తోటల్లో అంతర్‌ పంటగా సాగవుతున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తిస్తున్నారు. అలాగే నల్లమల అటవీ గ్రామాల్లో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అటవీ గ్రామాల్లో గంజాయి చెట్లు తయారైన తర్వాత వాటిని ఎండబెట్టి పౌడర్‌గా మార్చి ఇతర రాష్ట్రాలకు స్మగ్లర్లు తరలిస్తున్నట్లు తేలింది.

పది రోజలుగా రాష్ట్ర వ్యాప్తంగా తోటలపై ఎక్సైజ్‌, పోలీసులు విడివిడిగా జరిపిన దాడుల్లో వందలాది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజా మండలంలోని మూడు గ్రామాల్లో జరిపిన దాడుల్లో మిర్చి, పత్తి పంటల్లో మిశ్రమంగా సాగు చేస్తున్న 223 గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా అసిఫాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి సాగుపై పోలీసులు దృష్టి సారించారు.

పంట పొలాల్లో అంతర్‌ పం టగా గం జాయి సాగు చేస్తే ఎన్‌డి పిఎస్‌ చట్టం ప్రకారం పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గంజాయి పంట కొనుగోలు చేసినా, అమ్మకాలు జరిపిన వ్యక్తులతో సహా గంజాయిని సేవించిన వారు కూడా ఎన్‌డిపిఎస్‌ చట్టం ప్రకారం శిక్షకు అర్హులేనని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాను సారం గంజాయి సాగు చేసిన రైతులకు రైతుబందు, బీమా, విద్యుత్‌ సౌకర్యాలను రద్దు చేస్తామని చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో తోటల్లొ  అంతర్‌పంటగా గంజాయి సాగు అవుతున్న సంగతి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌, పంచాయితీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement