ముత్తుకూరు మే 29( ప్రభ న్యూస్) కృష్ణపట్నం బైపాస్ రోడ్డు మార్గంలో చలివేంద్రం గ్రామ సమీపాన ఏటి కాలువ లో డ్రైనేజీ కలుస్తూ ఉండడం వల్ల మత్స్యసంపద ను కోల్పోతున్నామని దీని మూలంగా జీవనోపాధి లేకుండా ఉందని ముత్తుకూరు గ్రామపంచాయతీ చలివేంద్రం గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో రెవిన్యూ శాఖ డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. సుమారు 50 మంది గిరిజన కుటుంబాలు సంతకాలతో కూడిన అర్జీని ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చేపలు, రొయ్యలు కాలువలో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యలు దొరికే కాలువలో డ్రైనేజీ రావడం ఏమిటని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.
సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి కండలేరు క్రీకు లో మత్స్య సంపదను పట్టుకునేందుకు వీలు లేకుండా దారి మూసి వేస్తున్నారని వెంటనే పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని గిరిజనులు కోరారు. ఇప్పటివరకు జీవనం కోల్పోయామని వెంటనే ప్యాకేజీ వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని గిరిజనులు అధికారులను విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తామని డిప్యూటీ తాసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకులు తదితరులు పాల్గొన్నారు.