అమరావతి, ప్రభన్యూస్: మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.. గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ వ్యాజ్యాలను ఇకపై రోజువారీ పద్దతిలో నిరాటంకంగా విచారణ జరుపుతా మని ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. ఈ వ్యాజ్యాలపై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి తేల్చి చెప్పారు. సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారంనాడు విచారణ ప్రారంభించింది. అయితే ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తులను మార్చాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా అభ్యర్థించింది.
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని పరిధిలో న్యాయమూర్తులకు గత ప్రభుత్వం 600 చదరపు గజాలు (గజం రూ. 5వేలు చొప్పున) కేటాయించిందని, ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణమూర్తి కూడా స్థలాలు పొందారని పిటిషన్‌లో వివరించారు.
ఈ కారణంగా వారు ధర్మాసనంలో సభ్యులుగా ఉండటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ ఇది సదుద్దేశంతో చేసిన అభ్యర్థన అన్నారు. న్యాయం జరగటమే కాదు.. జరిగినట్లు కూడా స్పష్టమవ్వాలని వ్యాఖ్యానించారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా స్పందిస్తూ న్యాయమూర్తులను మార్చాలనటానికి మీరెవరని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నేను కూడా జీతం తీసుకుంటున్నా.. అంత మాత్రాన నేను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఇలాగైతే ప్రతి ఒక్కరూ ఏదో సాకుతో ఫలానా జడ్జిని తప్పించాలని కోరతారని దీనిపై ఈ ధర్మాసనమే వాదనలు వింటుందని తేల్చిచెప్పారు. గత ఏడాది కాలంగా ఈ కేసులు ముందుకు సాగటంలేదు.. ఇక ఎన్ని రోజులైనా విచారణ ముందుకు సాగాల్సిందే. రోజువారీ పద్దతిలో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని అంతా ఆసక్తికరంగా నిరీక్షిస్తున్నారని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily