Friday, November 22, 2024

Big Story: వైద్యశాఖలో రవాణా దందా, మందులు సప్లయ్​ చేయకున్నా బిల్లులు స్వాహా

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది అధికారుల పనితీరు ఆ శాఖ లక్ష్యాలను, ప్రభుత్వ ఆశయాలను దెబ్బతీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల పరిధిలో మెరుగైన సేవలను అందించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికపుడు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే అదే శాఖలోని కొంతమంది అక్రమార్జనకు అలవాటుపడి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ఇటు సొంత శాఖకు, అటు ప్రభుత్వానికి బ్యాడ్​ నేమ్​ తెస్తున్నారు. చివరికి మందులు సరఫరా విషయంలో కూడా అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.

ఆంధ్రప్రభ, అమరావతి బ్యూరో: జిల్లా కేంద్రాల్లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం నుంచి ఆయా పీహెచ్‌సీలకు అవసరాన్ని బట్టి ప్రతినెల రెండు విడతలుగా మందులను సరఫరా చేస్తుంటారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను, వాటి నిర్వహణకు(ఇంధన ఖర్చులకు) కొంత వ్యయాన్ని కేటాయిస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాహనం మరమ్మత్తులకు గురైందని కుంటి సాకులు చెబుతూ నెలల తరబడి క్రింది స్థాయి సిబ్బందినే వచ్చి మందులు తీసుకుని వెళ్లాలని హుకూం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో పీహెచ్‌సీల పరిధిలోని హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలే సొంత డబ్బులు వెచ్చించుకుని మందులను తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 8 జిల్లాల్లో ఇదే తరహా రవాణా నిధుల దోపిడీ సాగుతున్నట్లు సొంత శాఖ సిబ్బంది నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.

మందులు చేరవేయకుండానే.. బిల్లులు స్వాహా
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), అలాగే పట్టణ ప్రాంతాల్లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ప్రతినెల వాటి పరిధిని బట్టి ప్రభుత్వం మందులను సరఫరా చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ప్రధాన నిల్వ కేంద్రం నుంచి జిల్లా స్థాయిలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం పరిధిలోని నిల్వ కేంద్రాలకు సరఫరా చేస్తుంటారు. అక్కడి నుండి జిల్లా వైద్యాధికారులు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం పక్షం రోజులకొకసారి పీహెచ్‌సీల స్థాయిని బట్టి మందులను సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా వ్యాన్‌ సౌకర్యాలను కల్పిస్తుంది. వాటి నిర్వహణకు ఏటా నిధులను కూడా కేటాయిస్తుంది. అవసరం అయిన సందర్భంలో నెలకు మూడు, నాలుగు విడతలుగా అయినా మందులను అందించాల్సి ఉంటుంది.

అయితే కొన్ని జిల్లాల్లోని వైద్యాధికారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను మరమ్మత్తుల పేరుతో పక్కపెట్టేసి పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే సిబ్బందే స్వయంగా వచ్చి మందులు తీసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే నిజంగానే ప్రభుత్వ వాహనం మరమ్మత్తులకు గురైందా..అంటే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నుంచి కాదనే సమాధానం బలంగా వినిపిస్తుంది. కొంతమంది అధికారులు పథకం ప్రకారం ఆ వాహనాలను పక్కన పెట్టేసి సిబ్బందే మందులు తీసుకుని వెళ్లాలని హుకూం జారీ చేస్తున్నారు. అయితే ప్రతి నెల మాత్రం క్రమం తప్పకుండా పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ డీజిల్‌, వాహన నిర్వహణ ఖర్చుల పేరుతో ఏటా లక్షల్లో బిల్లులు చూపిస్తూ దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా కోవిడ్‌ వ్యాక్సిన్‌, తల్లిపిల్లల సంరక్షణ పుస్తకాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌, ఐరన్‌ బిల్లలు, నులిపురుగుల మాత్రలను ప్రభుత్వం పెద్ద ఎత్తున సరఫరా చేసింది. వాటన్నింటిని క్షేత్రస్థాయిలో పీహెచ్‌సీలకు చేరవేయాల్సిన బాధ్యత జిల్లా వైద్యాధికారులదే. అయితే అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో పాటు సొంత ఖజనాను నింపుకోవడానికి రవాణా పేరుతో మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ సొంత శాఖ సిబ్బంది నుంచే విమర్శలందుకుంటున్నారు.

- Advertisement -

పీహెచ్‌సీల సిబ్బందిపై.. సొంత ఖర్చుల భారం
ప్రతినెల వివిధ రకాల మందు బిల్లలు, ఇంజక్షన్లతో పాటు వివిధ రకాల వ్యాక్సిన్‌లు, ప్రత్యేకంగా కోవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజర్‌ వ్యాన్ల ద్వారానే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయాలి. అయితే కొన్ని జిల్లాల్లో ఉన్నతాధికారులు ఆ వాహనాలను పక్కన పెట్టేసి అద్దె వాహనాల్లో మందులు తరలించినట్లుగా రికార్డుల్లో చూపించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. డెమో సెక్షన్‌లో ఆర్‌పీహెచ్‌లకు సంబంధించిన పుస్తకాలను ఏఎన్‌ఎంలకు అందించాల్సి ఉంది. ఒక్కో పుస్తకం బరువు సుమారు 5 కేజీలకు పైగానే ఉంటుంది. అంత బరువు కలిగిన పుస్తకాలను వైద్యాధికారులే ప్రభుత్వ వాహనంలో పీహెచ్‌సీలకు చేర్చి అక్కడి నుండి ఏఎన్‌ఎంలకు అందించాల్సి ఉంది. వాటితో పాటు తల్లిబిడ్డల సంరక్షణ పుస్తకాలను కూడా వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవసరం అయిన తల్లులకు అందజేయాల్సి ఉంది.

అయితే అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర స్థాయి నుంచి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని జిల్లాకు చేరిస్తే స్థానికంగా ఉన్న అధికారులు మాత్రం పీహెచ్‌సీల పరిధిలోని వైద్య సిబ్బందిపై భారం మోపుతున్నారు. ప్రతినెల అవసరం అయిన సందర్భంలో వారే స్వయంగా వచ్చి తీసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సొంత ఖర్చులతో ఆటోలో వాటిని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళుతూ ఆర్ధికంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడం, అసలు వాహనాల ద్వారానే మందుల సరఫరా జరుగుతుందా అన్న అంశంపై నిఘా పెట్టకపోవడం చూస్తుంటే ఉన్నతాధికారులకు తెలిసే ఈ తతంగమంతా సాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు మందుల సరఫరా వ్యవహారంపై రహస్యంగా విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement