అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. మంగళగిరి ఆరవ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న విశాల్ గున్నీని విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తున్న పి. జోషువా స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. జోషువాకు కృష్ణా జిల్లా ఎస్పీగా, కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ కౌశిల్‌ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిని కోనసీమ జిల్లా ఎస్పీగా, ఆ స్థానంలో ఉన్న కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డిని మంగళగిరి ఆరవ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జిల్లా మార్పు పేరు నేపథ్యంలో ఇటీవల కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు ఏకంగా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేసి దహనం చేశారు. ఈ అల్లర్లను నియంత్రించేందుకు దాదాపు 15 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇంత పెద్దస్థాయిలో ఆందోళనలు జరిగే విషయాన్ని గుర్తించడంలో, నియంత్రించడంలో విఫలమైనందునే కోనసీమ జిల్లా ఎస్పీపై వేటు పడినట్లు ఐపీఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.