అమరావతి, ఆంధ్రప్రభ:ఆర్టీసీ ఉద్యోగుల బదిలీలు ఐశ్చికమే తప్ప బలవంతం కాదని యాజమాన్యం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థన మేరకే బదిలీలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఆర్టీసీలో బదిలీలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపధ్యంలో యాజమాన్యం బదిలీలపై పునరాలోచన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగుల బదిలీలపై ఆప్షన్లు ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందట ప్రధాన కార్యాలయంలోని పర్సనల్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ డిపోలు, రీజినల్, జోనల్ స్థాయిల్లో ఐదేళ్లు పైబడి సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాల జాబితాను సోమవారం లోగా ప్రధాన కార్యాలయానికి పంపాలంటూ ఉత్తర్వులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర శాఖల మాదిరి మాస్ బదిలీలు చేసిన పక్షంలో ఆర్టీసీ సంస్థ మనుగడకే ప్రమాదమే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఆర్టీసీ యాజమాన్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఎర్ర బ్యాడ్జీలు డిపోలు, గ్యారేజీల ఎదుట ధర్నాలు, నిరసనలు, గేట్ మీటింగ్‌లు నిర్వహించారు.
ఈ నేపధ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. రీజియన్ కేడర్ ఉద్యోగులైన టీఐ-3, లీడింగ్ హ్యాండ్, డీసీలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రిక్వెస్టుపై బదిలీ చేయనున్నట్లు తెలిపారు. అప్పుడు కూడా డిపోల్లోని సెక్షన్లలో అంతరాయం లేకుండా చూసేందుకు సాధ్యమైనంత వరకు తక్కవు బదిలీలు మాత్రమే చేపడతారు. జోనల్ కేడర్ ఉద్యోగులు, అధికారుల సామర్థ్యాన్ని పరగణలోకి తీసుకొని మాత్రమే రిక్వెస్టు బదిలీలు చేస్తారు. ఏళ్ల తరబడి బదిలీలు కోరుకుంటున్న వారి కోసమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎండీ తిరుమలరావు తెలిపారు. అంతే తప్ప డిపోల్లో స్థిరపడిన ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, అసిస్టెంట్ మెకానిక్‌లను సర్వీసు పేరిట పెద్ద ఎత్తున బదిలీ చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.