నెల్లూరు, ప్రభన్యూస్ : గోవాకు చెందిన మద్యాన్ని నెల్లూరు జిల్లాకు దిగుమతి చేసి మనరాష్ట్రానికి చెందిన స్టిక్కర్లను అంటించి ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే విక్రయాలు సాగించిన కేసులో కొంతమంది ఎక్సైజ్ అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసింది. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఈ నెల 28వ తేదీ వాహనాల తనిఖీ చేపట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గోవా మద్యం పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో పలు ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు రూ.23 లక్షలు విలువ చేసే 18 వేల గోవా మద్యం బాటిళ్లను సీజ్ చేసి 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లు కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ రజిత్ భార్గవ్, ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించడంతో ఈ నెల 30వ తేదీ ఈ కమిటీ జిల్లాలోని అనంతసాగరం, చిలకలమర్రి, ఇందుకూరుపేట, మైపాడు తదితర ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
గోవా మద్యం కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి కమిషనర్‌కు అందజేశారు. నివేదికను ఆధారంగా చేసుకుని ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కింద ఐఎంఎల్ డిపో-1 ఇన్‌స్పెక్టర్ పి.కిషోర్‌ను, ఎస్సైలు కెవిఆర్ ఆంజనేయులు, ఎండి ఆసిఫ్‌బేగ్‌లను ఓజిలి ప్రాంతంలో ఉన్న ఐఎంఎల్ డిపో-2కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఐ. శ్రీనుబాబు, ఎస్సైలు సీహెచ్ పూర్ణకుమార్, బి. శ్రీనివాసులును నెల్లూరు ఐఎంఎల్ డిపో-1లో నియమించారు. అదేవిధంగా ఆత్మకూరు కానిస్టేబుల్ మాలకొండయ్యను ఉదయగిరికి, అక్కడ పనిచేస్తున్న తులసీదాస్‌ను ఆత్మకూరుకు బదిలీ చేశారు.
ఎక్సైజ్ అధికారుల ప్రమేయంపై పలు అనుమానాలు..?
గోవా మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా పెద్ద ఎత్తున మద్యం జిల్లాలోకి దిగుమతి కావడం, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే విక్రయాలు సాగించడం జరగదని పలువురు చర్చించుకుంటున్నారు. సెబ్ అధికారులు అరెస్టు చేసిన నిందితులను విచారించగా గోవాకు చెందిన మద్యం 400 కేసులు నెల్లూరుకు తరలించినట్లు విచారణలో తేలింది. అయితే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం 17,808 బాటిళ్లు అంటే 371 కేసులు, మిగిలిన 29 కేసులు మద్యం దుకాణాల్లో విక్రయించినట్లే కదా అని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారుల పాత్రలోనే ఈ వ్యవహారం జరిగి ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..