శ్రీసత్యసాయి , ప్రభ న్యూస్: అనంతపురం జిల్లా కేంద్రంలో రేపు (ఆదివారం) సైబర్ నేరాలపై శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్టు ఏపీ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు (శనివారం) ఆయన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం అతిధి గృహం చేరుకున్నారు. అక్కడ ఆయనకు అనంతపురం రేంజ్ డిఐజి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కిరప్ప, శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డి.ఎస్.పి క్యాంప్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఎస్పీ కార్యాలయంగా అనుకూలమైతే దీనిని వాడుకోవచ్చునని ఎస్పీకి సూచించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, నూతన జిల్లాల్లో పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని, జిల్లాలకు ఆర్మీ రిజర్వుడ్ ఫోర్స్ ఇప్పటివరకు కేటాయించలేదని, వాటిని పూర్తిస్థాయిలో జిల్లాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందని, రోడ్ యాక్సిడెంట్, హత్యలు, సైబర్ క్రైమ్ మాత్రం పెరిగిందన్నారు.
ఇటీవల లోక్‌అదాలత్ లో 1300 కేసులు పరిష్కారం అయ్యాయని, ఇంకా 3 వేల కేసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి పరిష్కరిస్తామని, ఇంకా పదివేల కేసులు ఉంటాయని వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నిర్మూలించేందుకు శిక్షణ తరగతులు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని శిక్షణ తరగతులకు ఎస్‌ఐలతో పాటు పోలీస్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇస్తామని, వారు తిరిగి ఆయా డివిజన్లో ఎస్‌ఐలతో పాటు పోలీసులకు శిక్షణలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు అయిదు విడతలుగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు విజయవాడలో డేటా బేస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇందు కోరకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతి పొందామన్నారు. సైబర్ నేరాల ద్వారా బ్యాంకులలో అకౌంట్లు ఫ్రీజ్ చేసి నగదును సైబర్ క్రైమ్ నేరగాళ్లు దొంగలిస్తున్నారని, వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఆయన అనంతపురం బయలుదేరి వెళ్లారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.