Thursday, November 21, 2024

పెట్రోల్, డీజీల్, గ్యాస్ వడ్డనపై టీపీసీసీ ఆందోళన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, తదితరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజలపై పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల వ్యవహారంపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతుందని పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టామని, కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి ప్రజావాణిని వినిపించకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సలహాలు, సంప్రదింపులు లేకుండా నియంతల పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని ఆయన నొక్కి చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల భయాందోళనలు చూసి తాము ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్రానికి వడ్లు కొనమని కేసీఆర్ లేఖ రాయకుండా ఇప్పుడు కొనమని చెబుతూ ఉద్యమాలు చేస్తున్నారని పొన్నాల ఎద్దేవా చేశారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కార్యక్రమాలను నిరంతరం చేపడుతూనే ఉంటామని తెలిపారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఇంత విపత్కర పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును ఎందుకు తగ్గించట్లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో 2008లో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్యాస్ కంపెనీలు 50 రూపాయలు పెంచితే ఆ భారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే భరించిందని పొన్నాల గుర్తు చేశారు. విద్యుత్ సరఫరా, దుబారా, 24 గంటల సరఫరా ముసుగులో దోపిడీ వంటి అంశాలకు తమతో చర్చకు రావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీపీసీసీ నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తే పోలీసులు వారి వెంట నిలిచి మద్దతిస్తున్నారని, కాంగ్రెస్ ధర్నా చేపడితే నేతలను ఇళ్లలోనే హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాయని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఓపిక నశిస్తే తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఏ పోలీసులైతే అణగదొక్కుతున్నారో, వారికే ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement