న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని రుషికొండపై చేపట్టిన టూరిజం ప్రాజెక్టును నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించి రుషికొండ ప్రాజెక్టు చేపట్టిందని ఆరోపిస్తూ నర్సాపురం ఎంపీ కే. రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరిపి ప్రాజెక్టు పనులపై స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాల్సిందిగా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేల త్రివేది ధర్మాసనాన్ని కోరారు. రుషికొండ టూరిజం ప్రాజెక్టు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకపక్షంగా తొలుత ఆదేశాలు జారీచేసిందని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినలేదని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే వాటిని తిరస్కరిస్తూ మే 20న మరోసారి ఆదేశాలు జారీ చేసిందని సింఘ్వి పేర్కొన్నారు.
ఎన్జీటీ స్టే విధించే సమయానికి రుషికొండ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. త్వరలో రుతుపవనాలు కూడా ప్రవేశించనున్న నేపథ్యంలో, ఈలోగా మిగతా పనులను పూర్తిచేయాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితులు, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేసు విచారణ వెంటనే చేపట్టాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం సోమవారం కేసు విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..