Sunday, November 24, 2024

Tough Fight – క‌డ‌ప‌లో బ్ర‌ద‌ర్స్ వర్సెస్ సిస్ట‌ర్స్..

జిల్లాలో పొలిటిక‌ల్ హీట్‌
వైఎస్ఆర్ కుటుంబానికి క‌డ‌ప కంచుకోట‌
వివేక హ‌త్య‌తో రెండుగా చీలిన వైఎస్ కుటుంబం
అన్న‌పై చెల్లెళ్ల యుద్ధం
ఏపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల టార్గెట్ సీఎం జ‌గ‌న్‌, ఎంపీ అవినాష్‌
హ్యాట్రిక్ విజయంపై అవినాష్ రెడ్డి కన్ను
వైఎస్ కుటుంబ విభేదాల‌తో టీడీపీ ప్ల‌స్ అయ్యేనా?
స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా క‌డప ఎంపీ సీటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి… ఈ క్రమంలో క‌డ‌ప జిల్లాలో పాలిటిక్స్ హాట్‌ హాట్‌గా మారాయి… వైఎస్ఆర్ ఫ్యామిలీలో నెల‌కొన్న విభేదాలు జిల్లా రాజ‌కీయాలను ప్రభావితం చేస్తున్నాయి… వైఎస్.వివేకానందరెడ్డి హ‌త్య‌తో రెండుగా చీలిపోయిన వైఎస్ కుటుంబాలు.. ఎల‌క్ష‌న్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి… అన్న‌లు జ‌గ‌న్‌.. అవినాష్‌లు ఒక‌వైపు… చెల్లెళ్లు ష‌ర్మిల‌.. సునీత మ‌రో వైపు ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి… ఈ ఫ్యామిలీ వార్ ద్వారా టీడీపీ ల‌బ్ధి పొందాల‌ని చూస్తోంది… వైఎస్ కంచుకోట క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని చురుగ్గా పావులు కదుపుతోంది…

కడప – ప్రభ న్యూస్ బ్యూరో

కడప జిల్లా రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అన్నా.. చెల్లెళ్ల పొలిటికల్ యుద్ధం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబం రెండుగా చీలి, వచ్చే ఎన్నికల్లో తలపడబోతున్నాయి. కడప పార్లమెంట్ స్థానం వేదికగా రసవత్తర పోరు సాగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం.. అన్నపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి తన సత్తా ఏమిటో పుట్టిన గడ్డపైనే నిరూపించుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కడప లోక్​సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. జెండాలు.. అజెండాలు పక్కనపెట్టి వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపెట్టి పోటీ పడుతున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని ఎన్నికల ప్రధాన అస్త్రంగా మార్చుకుని ఇరువర్గాలు పోరుకు సై అంటున్నాయి.

ఢీ అంటే ఢీ..
వచ్చే అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలు అధికార వైసీపీకి.. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ.. ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే కడప జిల్లాలో మాత్రం ఆసక్తికర సమరం సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అసలు జెండా మోసే వారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కడపలో అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కడప లోక్‌సభ నుంచి పోటీ చేయనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట
వాస్తవానికి కడప లోక్‌సభ స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. 1989 ఎన్నికల నుంచి ఆ కుటుంబ సభ్యులే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆ ఎన్నికల్లో కడప లోక్​సభ స్థానానికి పోటీ చేసిన డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి 1,66,752 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి ఎన్వీ.రమణారెడ్డి పై విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ వైఎస్, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీ.రామచంద్రయ్య పై 4,18,925 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1996 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై కేవలం 5445 ఓట్ల మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అదేవిధంగా 1998 ఎన్నికల్లోనూ వీరిరువురే ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆ ఎన్నికల్లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి 53,881 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్.వివేకానంద రెడ్డి లోక్​సభ ఎన్నికల బరిలో దిగారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డిపై 26,597 ఓట్ల మెజారిటీతో వివేకానందరెడ్డి గెలుపొందారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, తెలుగుదేశం అభ్యర్థిగా ఎంవీ.మైసూరా రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేక 1,31,674 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

- Advertisement -

జగన్​ హయాంలోనూ..
ఇక 2009 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి కడప పార్లమెంట్ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాలెం శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. ఆయనపై వైఎస్.జగన్ 1,78,846 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్.జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్​సభ స్థానానికి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఎంవీ.మైసూరా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ డీఎల్.రవీంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్.జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వైఎస్.జగన్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడంతో కడప పార్లమెంట్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్.అవినాష్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఆయనపై వైఎస్.అవినాష్ 1,90,323 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత 2019 ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎంపీగా, వైకాపా అభ్యర్థిగా వైఎస్.అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అవినాష్ 3,80,726 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా కడప లోక్​సభ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారింది.

వైఎస్ వివేకా హత్యతో చీలిక..
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్.వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ప్రకంపనలు లేపింది. హత్యకు టీడీపీ నేతలే బాధ్యులంటూ వైసీపీ.. మాకు సంబంధం లేదంటూ టీడీపీలు పరస్పర ఆరోపణలకు దిగాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ, ప్రస్తుతం సీబీఐ కోర్టులో కొనసాగుతోంది. ఈ హత్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. కుటుంబం రెండుగా చీలిపోయింది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సోదరి వైఎస్ షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అన్న జగన్ పై యుద్ధాన్ని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, ఏపీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు.

ఈసారి మరింత రసవత్తరంగా ఎన్నికలు.?
కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఈసారి దివంగత నేత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. ఒక వేళ ఆమె ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటే టీడీపీ, జనసేనలు మద్దతిస్తాయని అందరూ భావించారు. అయితే అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీకి సిద్ధమయ్యారు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం సైతం భావిస్తోంది. ఇప్పటికే కడప లోక్‌సభ స్థానానికి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో అక్కాతమ్ముళ్ల మధ్య పోరు వచ్చే ఎన్నికల్లో జరగబోతుంది. అయితే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనకు సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

షర్మిల వ్యూహాత్మక అడుగులు..
పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ సర్కారును వైఎస్.షర్మిల లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించినప్పటికీ, అవినాశ్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తన లక్ష్యానికి అనుగుణంగా షర్మిల వ్యూహాత్మకంగా పథక రచన సాగించి, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కడప కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. లోక్​సభ పరిధిలోని కీలకమైన ఏడు నియోజకవర్గాలపై షర్మిల పోటీ ప్రభావం ఉంటుందన్నది వాస్తవం కాగా, కడప లోక్​సభ నియోజకవర్గం పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ ప్రస్తుతం వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో షర్మిల అన్న సీఎం జగన్ పోటీ చేస్తుండగా.. కమలాపురంలో షర్మిల సొంత మేనమామ పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కడప పార్లమెంట్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా షర్మిల ఆచితూచి అడిగేస్తున్నారు. బలమైన నేతలను బరిలో దింపేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ నేతలైన మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వంటి వారితో చర్చిస్తూ వారిని ఒప్పించి ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆమె యోచిస్తున్నారు.

టీడీపీ కలిసి వచ్చేనా?
అదేవిధంగా పులివెందులలో జగన్‌పై కాంగ్రెస్ అభ్యర్ధిగా సునీత కాకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీలో ఉంటారన్న టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. అదే జరిగితే కడప పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు. మరోవైపు వైఎస్ కుటుంబ విభేదాలతో పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి కి కలసి వచ్చే అంశంగా మారింది. కడప ఎంపీ స్ధానం పరిధిలోని జమ్మల మడుగు నుంచి భూపేష్ బాబాయి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోటీలో ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి కడప ఎంపీ సీటు స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement