ఒంగోలు – నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి.. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు బాలినేని.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బాలినేని… రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల దగ్గరకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి మీ సంగతి తేలుస్తామంటూ బెదిరించారని, తమ కార్యకర్తలను ఒంగోలు రిమ్స్ లో బెదిరించిన వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కావాలనే ప్లాన్ చేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందించకపోతే ఇళ్లకు వెళ్లి కొడతామని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ బెదిరిస్తున్నారని ఆరోపించారు.. ఒంగోలు ఇష్యూ మీద అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు బాలినేని..
స్పందించిన కరణం బలరాం …
మరోవైపు.. ఒంగోలు ఘటనపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పందిస్తూ.. చంద్రబాబుకు చెప్పింది వినే అలవాటు ఉందే కానీ నిజాలు తెలుసుకునే అలవాటు లేదన్నారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించిన ఆయన.. ఈ ఘటన కావాలని క్రియేట్ చేసిన సమస్యలా కనిపిస్తుంది.. బాలినేని కుటుంబ సభ్యుల ప్రచార సమయంలో వారిని టీడీపీ కార్యకర్తలు కించపరిచేలా మాట్లాడారు.. వాలంటీర్ గా రాజీనామా చేసిన ఓ మహిళతో ఓట్లు అడిగే సందర్బంలో టీడీపీ కార్యకర్తలు ఆమెను దుర్బాషలాడారు.. ఇలాంటి జిమ్మిక్స్ వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. కులాల మధ్య తేడాలు పెట్టాలని చూస్తున్నారు.. ఇది చాలా తప్పు.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లు అడిగే హక్కు ఉంటుంది.. అలా అడిగే వారిపై దాడులు చేయాలనుకోవటం సరికాదని చంద్రబాబుకు హితవు పలికారు ఎమ్మెల్యే కరణం బలరాం.