Sunday, November 24, 2024

చీకటి గదిలోకి లాక్కెళ్లి చిత్రహింసలు పెట్టారు.. పోలీసులపై మహిళ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న మహిళను తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఎం. ఉమామహేశ్వరిని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి విచారణ పేరుతో హింసించినట్టు తెలుస్తోంది. కాగా ఆ వీడియలో  తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులు తనను వేధించారని, తప్పుడు దొంగతనం కేసు మోపారని బాధిత మహిళ ఆరోపించింది. పైగా చేయని తప్పును అంగీకరించాలని ఒత్తిడి చేశారని పేర్కొంది. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండ్ వేణుగోపాల్ రెడ్డి నివాసంలో తాను పనిమనిషిగా పనిచేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రోజువారీ పనిలో భాగంగా ఇంటికి వచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, ఆయన భార్య మధ్య డబ్బు మాయమైన విషయంపై గొడవ జరిగిందని,  ఆ సమయంలో భార్యాభర్తలు డబ్బు మాయమైన విషయాన్ని తనను అడిగినట్టు తెలిపింది.

దీనిపై ఉమామహేశ్వరి స్పందిస్తూ.. డబ్బు గురించి తనకు తెలియదని బదులిచ్చింది. ఆ తర్వాత ఉమామహేశ్వరిపై వేణుగోపాల్‌రెడ్డి దొంగ అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఇంట్లో రూ.2 లక్షల నగదు కనిపించకపోవడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా ఉమామహేశ్వరితో పాటు ఆమె భర్తన విచారించారు. అయితే తప్పుడు ఆరోపణలను అంగీకరించి డబ్బు తిరిగి ఇవ్వాలని పోలీసులు పట్టుబట్టారని ఉమామహేశ్వరి పేర్కొన్నారు.

అదే వీడియోలో ఉమామహేశ్వరి మాట్లాడుతూ ‘‘పోలీసులు నన్ను వేధించారు. పరుష పదజాలంతో తిట్టారు. వారు నన్ను పోలీసు స్టేషన్‌లోని చీకటి గదిలో హింసించారు. రాత్రి వరకు ఇంటికి వెళ్లడానికి కూడా  అనుమతించలేదు”అని తెలిపింది.. ఫోన్‌లో ఏఎన్​ఐ మీడియాతో మాట్లాడారు పోలీసులు.. చిత్తూరు 1 టౌన్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఆమె ప్రకటలో వాస్తవం  లేదని అన్నారు. ఈ ఆరోపణలను నిరాకరిస్తూ చిత్తూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేరుతో పోలీసు అధికారులు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్​ చేశారు.

“వేణుగోపాల్ రెడ్డి తన ఇంట్లో ₹ 2 లక్షల చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తూ  ఉమామహేశ్వరిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా  విచారణ చేపట్టాం. ఆమెకు అధికారిక నోటీసు పంపడం ద్వారా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లాం. ఈ విచారణలో ఆమె డబ్బు తీసుకున్నట్లు అంగీకరించింది. ఆమె అంగీకారంతో ఆ డబ్బు ఎక్కడ పెట్టారని పోలీసులు ప్రశ్నించారు. ఆ డబ్బు తన భర్త  వద్ద ఉందని ఆమె వెల్లడించింది. పోలీసులు అనుమతిస్తే, తన భర్త వద్దకు వెళ్లి డబ్బు తిరిగి తీసుకువస్తానని చెప్పింది. కానీ, ఆమె ఆరోపిస్తున్నట్లు పోలీసులు ఆమెను వేధించలేదు, హింసించలేదు, దుర్భాషలాడలేదు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందున ఆమె పోలీసులపై ఆరోపణలు చేస్తోంది” అని పోలీసు అధికారులు తెలిపారు.  కాగా, ఈ ఘటనను టీడీపీ అనాగరికం, క్రూరమైన చర్యగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement