Tuesday, November 26, 2024

వైసిపిలో ఎమ్మెల్సీల ప‌ద‌వుల సంద‌డి…

ఆరేళ్ల పదవి కావడంతో పలువురు సీనియర్ల కన్ను
సీఎం జగన్‌ను కలిసేందుకు ఆశావహుల విశ్వప్రయత్నాలు
ఖాళీ కానున్న 23 ఎమ్మెల్సీ సీట్లలో 18 ఏకపక్షంగా వైసీపీకే
ఐదు స్థానాలకే పోటీ

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల సందడి నెలకొంది. ఈ ఏడాది 23 శాసన మండలి పదవులు ఖాళీ కానున్నాయి. ఇందులో 90 శాతం వైసీపీకి దక్కనున్నాయి. దీంతో ఆశావహులు తమ పొలిటికల్‌ గాడ్‌ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డం.. ఆశించిన పదవి దక్కించు కోలేకపోయాం. ఈసారైనా న్యాయం చేయండి అని కొంతమంది, రానున్న ఎన్నికల్లో పార్టీ కోసం ఏమైనా చేస్తాం … ఎమ్మెల్సీ పదవి ఇప్పించండి అంటూ మరికొందరు పార్టీ పెద్దల వద్ద కర్చీఫ్‌ వేస్తున్నారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చు. దీంతో ఎమ్మెల్సీ పదవికి భారీ డిమాండ్‌ పెరిగింది. పలు జిల్లాల్లో సీనియర్‌ నాయకులు సైతం ఎమ్మెల్సీ పదవులకు పోటీపడున్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశించే వారితో వైసీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడుతోంది. రాష్ట్ర మంత్రులు, పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే తమ మనసులో మాట బయటపెట్టిన ఆశావహులు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి విన్నవించుకొనేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ సామాజిక సమీకరణలకు పెద్ద పీఠ వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకే పార్టీ పదవుల నుంచి మంత్రి పదవుల వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణతో ఈ విషయం మరింత స్పష్టం అయింది. 2024 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన సీఎం జగన్‌ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవలే విజయవాడలో బీసీ సదస్సు నిర్వహించి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్ధేశం చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆచితుచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎమ్మెల్సీ పదవుల ఆశిస్తు న్న ఆశావహులకు తనను కలిసే ఛాన్స్‌ కూడా జగన్‌ ఇవ్వడం లేదని భోగట్టా. జిల్లాల వారీగా సామాజిక సమీకరణల్ని ముఖ్య అనుయాయులతో జగన్‌ బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ కోటాల్లోనే పోటీ
రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్ని ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాలతో పాటు స్థానిక సంస్థల కోటాతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లిdలో 151 స్థానాల్లో మూడొంతులు మెజార్టీ వైసీపీకి ఉంది. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన 7 స్థానాలు గవ ర్నర్‌ కోటాలో భర్తీ అయ్యే రెండు స్థానాలు, వైసీపీ సొంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఫ్యాన్‌ స్పీడ్‌ ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. మున్నెన్నడూ లేనంతగా పంచాయితీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు వైసీపీ తిరుగులేని ఆధిపత్యంలో నిల్చింది. సో.. స్థానిక సంలటస్థల కోటాలో భర్తీ కావా ల్సిన 9 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమకానున్నా యి. గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో భర్తీ కావాల్సిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ స్థానాల్లో పీడీఎఫ్‌ బలమైన పోటీ ఇవ్వనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఐదు స్థానాల్లో కనీసం రెండు సీట్లు దక్కించుకున్నట్లైతే 23కు 20 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ సొంత అవుతాయి. దీంతో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎమ్మెల్సీ పదవుల్ని గెలిచేందుకు అధికారపార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల్ని బరిలోకి దించడం ద్వారా సునాయాసంగా గెలవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

శాస‌న‌మండలిలో ఫ్యాన్ గాలి..

- Advertisement -

త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలతో శాసన మండలిలోనూ ఫ్యాన్‌ స్పీడ్‌ పెరగనుంది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లిd స్థానాలకు గాను 151 సీట్లు సాధించిన వైసీపీ శాసన సభలో తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకుంది. శాసన మండలిలో మెజార్టీ లేకపోవడంతో సీఎం జగన్‌కు తలనొప్పిగా మారింది. ఒకదశలో శాసన మండలిని రద్దు చేయాలనే ప్రతిపాదన చేశారు. ఆనక పార్టీ పెద్దల సలహా మేరకు జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బిల్లులు పాస్‌ కాకపోవడంతో తిరిగి సభలో ప్రవేశపెట్టి గవ ర్నర్‌కు పంపి ఆమోదం పొందాల్సి వచ్చేది. నిరుడు పలువురు టీడీపీ సభ్యుల పదవికాలం పూర్తవ్వడంతో వైసీపీ బలం కొంతమేర పెరిగిం ది. తాజాగా 23 స్థానాలు భర్తీ కావాల్సి ఉండటం తో శాసన మండలిలోనూ వైసీపీ బలమైన పక్షం గా మారనుంది. ఇప్పటి వరకు శాసన మండలి లో కొనసాగిన టీడీపీ హవాకు చెక్‌ పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement