Friday, November 22, 2024

Top Story – వైసిపి ఎమ్మెల్యేలలో అంత‌ర్మ‌థ‌నం … అధినేత మాట పెడ‌చెవిన పెట్టామంటూ ప‌శ్చాత్తాపం

అమరావతి, ఆంధ్రప్రభ : స్వయంకృతాపరాథమే అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు శాపంగా మారుతోంది.. సార్వత్రిక ఎన్నికల కు ఏడాది ముందు నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనెరడ్డి చేస్తున్న హెచ్చరికలు పెడచెవిన పెట్టిన పర్యవసానంగానే సొంత నియోజకవర్గాలు కాదని మరో నియోజకవర్గానికి వలస వెళ్లటానికి కారణమనేది స్పష్టమవుతోంది.. గత కొద్ది రోజులుగా క్యాంపు కార్యాల యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐ ప్యాక్‌ రుషి నేతృత్వంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ముమ్మరంగా కసరత్తు జరుపుతున్నారు..

ఇప్పటి వరకు పాతిక మందికి పైగా ఎమ్మెల్యేలకు ఈ సారి స్థానచలనం లేదా పక్కనపెట్టే దిశగా వడపోత కార్యక్రమం జరుగుతోంది.. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీల మెజారిటీ సాధించిన నేపథ్యంలో 2024లో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షం ఊసేలే కుండా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను పదేపదే అప్రమత్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు కరోనా కారణంగా ప్రభుత్వ వ్యవస్థ అతలాకుతలమైంది.. ఆర్థిక వ్యవస్థ కూడా విచ్ఛిన్నమైంది.. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన హామీలు, చట్టపరంగా అమలు చేయాల్సినవి కొలిక్కి రాక పోవటంతో రాష్ట్రం తిరోగమనంలో పయనించే పరిస్థితి నెలకొంది.. దీంతో ఓ వైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంటులో బలమైన రాజకీయ పార్టీల్లో వైసీపీ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు అంశా ల ప్రాతిపదికన మద్దతిస్తూ కొం త వరకు రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కల్పించటంలో కృతకృత్యులయ్యారు..

గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకింత గాడిన పడటంతో పాటు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆపై అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.. విభజన హామీలకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు జరుపుతోందనే సంకేతాలు అందాయి. దీంతో అప్పటి నుంచే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ శ్రేణుల్ని జాగృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. గత ఏడాది కాలంగా గడప- గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం కావాలని ఈ కార్యక్రమమే ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానంగా నిర్ణయించినా పలువురు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది..

ముఖ్యమంత్రి మెప్పు కోసం ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోయటం వరకే కొందరు పరిమితం కాగా మరికొందరు రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలతో క్యాడర్‌ను దూరం చేసుకున్నారు. ఇంకొందరు సొంత నియోజకవర్గాల్లో పార్టీ పట్టు కోల్పోతున్నా పొరుగు నియోజకవర్గాల్లో తలదూర్చటంతో ఆధిపత్యపోరు నెలకొంది.. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు నియోజకవర్గంలో వారి పరిస్థితి ఎలా ఉందనేది సర్వే నివేదికలు తేటతెల్లంచేసినా.. అధినేత హెచ్చరికలు చేస్తున్నా బేఖాతరు చేయటంతో సీటు చేజారే పరిస్థితికి దారితీసిందని సీటు కోల్పోతున్న సిట్టింగ్‌లు అంతర్మథనం చెందుతున్నారు.. అధికారికంగా, పార్టీలో వికేంద్రీకరణ సిద్ధంతాన్నే సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు.. పార్టీలో ఎన్నడూలేని వి ధంగా పూర్తి స్థాయిలో అంకితభావంతో పనిచేసిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ మరోవైపు పార్టీని అంటిపెట్టుకు ఉన్న సీనియర్లకు నామినేటెడ్‌, అధికారిక పదవుల్లో హోదా కల్పించారు.. మంత్రివర్గంలో కొత్తవారికి కూడా స్థానం కల్పించారు.

కరోనా కాలం నుంచి ఇంతవరకు రాష్ట్ర సచివాలయ సందర్శనకు నోచుకోని మంత్రులు కొందరికి ఇప్పటికీ తమ శాఖలపై పట్టులేదంటే అతిశయోక్తికాదు.. పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని క్యాడర్‌ను చేరదీయాలని రీజనల్‌ కోఆర్డినేటర్లను నియమిం చారు. ఒక్క ఐ ప్యాక్‌ మాత్రమే కాదు.. వివిధ రకాలుగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఉన్న పట్టుపై పూర్తి స్థాయి నివేదికలను తెప్పించుకుని మరీ జల్లెడపట్టారు..కోటిన్నర కుటుంబాలకు రెండున్నర లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చినా వలంటీర్ల వ్యవస్థతో పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ పథకాల ధృవీకరణ పత్రాలు ప్రతి ఇంటికీ చేరవేస్తున్నా ప్రభుత్వం చేసే పనులను తమతమ నియోజకవర్గాల్లోనే ప్రజల్లో విస్తృత ప్రచారం చేయటంలో చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అధినేత దృష్టికి వచ్చింది.. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం.. మీరు చేయాల్సినవి మీరు చేయండి.. నేను చేయాల్సింది నేను చేస్తాను..ప్రజా బాహుళ్యంలో విశ్వసనీయత పొందాలి.. మనం చేసిన మంచి ప్రజల్లోకి బలంగా వెళ్లాలి.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు వారికి వివరించాలి.. గతంలో ఏ ప్రభుత్వాలు తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం.. మంత్రులు..ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. క్యాడర్‌తో పాటు ప్రజలతో మమేకం కావాలని గత ఏడాదిన్నర కాలంగా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెట్టటం వల్లే సిట్టింగ్‌లకు ప్రత్యామ్నాయాలతో పాటు కొంతమందిని పక్కన పెట్టే పరిస్థితికి దారితీసిందనేది చెప్పక తప్పదు..

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏకమై మూకుమ్మడి దాడికి పూనుకుంటున్న నేపథ్యంలో ధీటైన ప్రత్యామ్నాయాలు తప్పనిసరనేది అధినేత భావనగా చెబుతున్నారు.. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్‌ పదేపదే గుర్తుచేయటంతో పాటు సర్వే నివేదికల్లో వారికున్న గ్రాఫ్‌ను ప్రత్యక్షంగా వివరించారు. పనితీరు మార్చుకోకపోతే మార్పు తప్పదనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.. అయితే అధినేత ఆదేశాలు పక్కన పెట్టిన పర్యవసానంగానే సీటు కోల్పోవాల్సి వస్తోందనుకుంటున్న మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ భరోసా ఇవ్వటంతో పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement