Friday, November 22, 2024

Top Story – ఏదీ.. ఎక్కడ.. ఎర్రెర్రజెండా?

ప్రజాప్రస్థానంలో కమ్యూనిస్టులు కాడె దించేశారా?

ఒకప్పుడు పేదలకు, బాధితులకు వారే భరోసా

సమస్య ఎక్కడుంటే అక్కడ ఎర్రజెండా ఎగిరేది

అన్యాయంపై అలుపెరగని పోరాటాలు జరిగేవి

స్వేచ్ఛ, హక్కులు, వెట్టి నిర్మూలన వారిచొరవే

- Advertisement -

ఉపాధి హామీ పథకానికీ కమ్యూనిస్టులే మూలం

ధనస్వామ్య రాజకీయాల్లో కామ్రేడ్ల వెనుకడుగు

కాలంచెల్లిన సిద్ధాంతాలతో తిరోగమనం

ప్రజా సమస్యలపై నిజమైన పోరాటాలు కరవు

రాజ్యమేలుతున్న నిరుద్యోగం.. దోపిడీస్వామ్యం..

సమాజంలో అణచివేతలు..

పెల్లుబికుతున్న అసంతృప్తులు

కమ్యూనిస్టు యోధులు మళ్లిd రావాలంటున్న మేథావులు

సమాజంలో అన్నివర్గాల్లోనూ ఇదే భావన

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇంచార్జ్‌)

మట్టిని, మనిషిని, చెమటను, చెట్టును ప్రేమించే సహజ లక్షణం కమ్యూనిస్టు సిద్ధాంతాలది. స్వేచ్ఛను, మార్పును, క్రాంతిని ఆకాంక్షించే భావజాలం వారిది. పోరాటాలకు ప్రతిరూపం.. కార్మిక, కర్షక, అణగారిన వర్గాల గొంతుక. ఎర్రజెండా వర్గరహిత స్వర్గం, మానవతకు నిలయం అన్నది కామ్రేడ్ల బలమైన నినాదం. ఇదంతా ఇప్పుడు గత చరిత్ర. మాది దీర్ఘకాలిక పోరాటం.. భవిష్యత్‌లో బలపడతాం అని ఆత్మవిశ్వాసం వ్యక్తంచేసిన కమ్యూనిస్టు పార్టీలు వర్తమానంలో ఉనికిపాట్లు పడుతున్నాయి. ఊహాతీతమైన వేగంతో మార్పు చెందుతున్న సమాజంతో పరుగులు తీయలేక సొమ్మసిల్లాయి. భవిష్యత్‌ కోసం కాలగర్భంలోని వందేళ్ల నాటి పునాదుల్ని వెతుక్కుంటున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజలపక్షాన నిలబడే శక్తిగా కమ్యూనిస్టులంటే సమాజంలో ఎనలేనిగౌరవం. వెనుదీయని వారి పోరాటలపై సమాజంలో అపార నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలకు దూరంగా దేశంకోసం, ప్రజల శ్రేయస్సుకోసం ఉన్నత ఆశయాలే ఆయుధాలుగాకమ్యూనిస్టుల ప్రస్థానం ప్రత్యేకమైనది. గ్రామస్థాయిలో వారు రగిల్చిన అరుణారుణ చైతన్య స్ఫూర్తి కిరణాలు అభ్యుదయ సమాజానికి బాటలు వేశాయి. దేశంలో చాలా పార్టీలు రకరకాల అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయాయి. అనేక విధాల అవకాశవాదాలతో రంగులు మార్చుకున్నాయి. కానీ వందేళ్ల చరిత్రలో కమ్యూనిస్టులు సామ్యవాద భావజాలానికి, లౌకిక ప్రజాస్వామ్య విలువలకు అంకితమై వాటిని కాపాడేందుకు అహర్నిశలు పాటుపడ్డారు. సెక్యులరిజాన్ని కాపాడడంలో, వివిధ రంగాల్లో ఆధిపత్య శక్తులను నియంత్రించడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందన్నది వాస్తవం. ముఖ్యంగా వెట్టిచాకిరీ నిర్మూలన, భూసంస్కరణలు కామ్రేడ్ల విజయాలకు చారిత్రక నిదర్శనాలు. ఇప్పటి పాలకుల గొప్పలన్నీ నాటి కమ్యూనిస్టు పోరాట విజయాలపై ఎగురుతున్న రంగుల జెండాలే. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హమీ పథకానికీ కమ్యూనిస్టు ఉద్యమాలు, చొరవే కారణమన్నది జగద్విదితం. కాలచక్రం గిర్రున తిరిగింది. దశాబ్దాలు గడిచాయి.. రాజకీయాల స్వభావం మారింది.. పోరాటాల స్వరూపం మారింది. ధనస్వామ్యం, కులాల సమీకరణ లెక్కల్లో కామ్రేడ్లు వెనకబడ్డారు. ఇందుకు కారణాలు అనేకం.చీలికలు.. తిరోగమనం..1952 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1955 ఆంధ్రా ఎన్నికల్లో విజయం తథ్యమని మెజారిటీ నాయకులు భావించినప్పటికీ వారి అంచనా తల్లకిందులైంది. కాకపోతే 1957లో కేరళ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. నంబూద్రిపాద్‌ అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల మార్గంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం అప్పటికి ప్రపంచంలోనే అరుదైన ఘటన. ఈ విజయంతో ఎన్నికల మార్గంలో అధికారంలోకి రావచ్చనే భావన కమ్యూనిస్టుల్లో బలపడింది. కాలక్రమంలో వామపక్షాలలో ఎంఎల్‌ పార్టీల దశ మొదలైంది. ఫోకస్‌ గ్రామాల నుంచి అడవులకు మళ్లింది. సీపీఐ చీలిపోయి సీపీఎం ఏర్పడానికి చాలాకాలమే పట్టింది కానీ తర్వాత సీపీఎం నుంచి సీపీఐ ఎంఎల్‌ శ్రేణుల వేరు కుంపట్లకు ఎక్కువ కాలమేమీ పట్టలేదు. 1952, 57 పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష #హూదా సంపాదించిన కమ్యూనిస్టు పార్టీ ఇవాళ పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకంటే వెనుకబడి వుండటం బాధాకరం.మార్పును స్వీకరించాల్సిందే…భూస్వామ్య శక్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమైనట్టుగా కమ్యూనిస్టులు పెట్టుబడిదారి వ్యవస్థను ఎదుర్కోవడానికి సన్నద్ధంకాలేక పోయారు. కాలానుగుణ మార్పులను వేగంగా అందిపుచ్చుకోలేక పోవడం ఇందుకు ప్రధాన కారణం. అందులోనూ ఈ వందేళ్లలో సమాజం పల్లెల నుంచి పట్టణాలుగా, పట్టణాల నుంచి నగరాలుగా మారుతున్న దశలో కమ్యూనిస్టుల ప్రయాణం నగరాలనుంచి గ్రామాలకు గ్రామాల నుంచి అడవులకు భిన్నమైన మార్గంలో సాగింది. అదే సమయంలో అంతర్జాతీయంగానే పెట్టుబడిదారి విధానం రూపం మార్చుకుంది. వర్తమానానికి అనువుగా తీర్చిదిద్దుకుంది. అయితే, కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఆమేరకు పరివర్తన జరగలేదు. రాజకీయ విధానాల పరంగానూ పరిపక్వత లోపించింది. ప్రభుత్వాలను శాసించే స్థితి నుంచి రాజీధోరణుల వైపు అడుగులేయడం కూడా వామపక్షాలకు గొడ్డలిపెట్టయింది. పోరాట పంథాపై పట్టుసడలింది. అధికార పార్టీలతో, ప్రభుత్వాలతో మెతక వైఖరులు కామ్రేడ్ల ప్రతిష్ఠను దెబ్బతీసింది. కమ్యూనిస్టు రాజకీయాల్లోకి యువతరం మొగ్గు చూపకపోవడం, కాలంచెల్లిన సిద్ధాంతాలతో రాన్రాను వైభవం మసకబారుతూ వచ్చింది. చివరకు ఎన్నికల్లో సొంతంగా పోటీచేయడానికి కూడా సాహసించలేని దుస్థితి ఏర్పడింది. ఒకటీ అరా సీట్లకోసం ఇతర పార్టీలతో పొత్తుకు వెంపర్లాడాడే దుర్గత దాపురించింది.ప్రజల పక్షాన పోరాడేవారేరీ?సమకాలీన రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. సిద్ధాంతాలు.. విధానాల కంటే అవసరాలు, స్వప్రయోజనాలే ఆయా పార్టీలకు ప్రధానమయ్యాయి. ఎవరు ఎప్పుడు ఎవరితో కలిసివుంటారో… ఎప్పుడు విభేదించుకుంటారో తెలీని పరిస్థితి. జాతీయ రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి వాతావరణమే నెలకొంది. అభివద్ధి.. సంక్షేమం.. జీవనప్రమాణాల గురించి ఆయా ప్రభుత్వాలు.. పార్టీలు ఎవరెన్ని చెప్పినా.. కమ్యూనిస్టుల పోరాటాలకు మూలమైన ఆనాటి సమస్యలు నేటికీ ఉన్నాయి. విద్య, ఉపాధి, శాంతిభద్రతల నుంచి హక్కుల వరకూ సామాన్యులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వ్యక్తులుగా వ్యవస్థలతో పోరాడలేక వేదన చెందుతున్నారు. గతంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఎర్రజెండాలతో ఉద్యమించే కామ్రేడ్లు.. ఇప్పుడు కరువయ్యారు. ఇళ్లు కూల్చివేస్తున్నా.. నిరుద్యోగులు లాఠీదెబ్బలు తింటున్నా వారితరఫున నిజాయతీగా ముందు నిలిచేవారే లేరు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం హంగామా చేసినా, బాధితులకు పూర్తిభరోసా లభించడం లేదు. ఇలాంటి సమయాల్లో కామ్రేడ్ల అండ ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సామాన్యులు భావిస్తున్నారు. అణగారిన వర్గాలకు కమ్యూనిస్టులతోనే సరైన న్యాయం లభిస్తుందని, వారుమాత్రమే తమకోసం నిజాయతీగా పోరాడేవారనే స్వరాలు వినిపిస్తున్నాయి. మేథావి వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి. రాజకీయాల కోసం కాకుండా , సమస్య పరిష్కారం కోసం, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రశ్నించేవారు లేకుంటే ప్రజాస్వామ్య సమాజం మనుగడ సాగించేదెలా? అనే ఆందోళన వినిపిస్తోంది.—————-

Advertisement

తాజా వార్తలు

Advertisement