వెూడీ మనసెరిగిన నేత
ఏపీ ప్రయోజనాలే ముఖ్యం
తగ్గి నెగ్గే సమయస్ఫూర్తి
భేషజాలకు ఆమడ దూరం
దరిచేరని గర్వం, దర్పం
వినయ విధేయతలకు దర్పణం
అనుభవమే ఆభరణం
ఫిదా అయిన ప్రధాని వెూడీ
భుజం తట్టి మెచ్చుకున్న వైనం
మంత్ర ముగ్దులైన ఎంపీలు, నేతలు
ఫుల్ జోష్‌లో బాబు ఢిల్లీ యాత్ర
(పసునూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
అమరావతి, ఆంధ్రప్రభ – చంద్రబాబు నాయుడు… అయిదు దశాబ్దాల రాజకీయ పరిపక్వతకు అచ్చుగుద్దిన నిలువెత్తు ప్రతిరూపం! ఎన్నో రాజకీయ తుపానులు… మరెన్నో ఆకస్మిక సుడిగుండాలు… ఇంకెన్నో అవమానాలు… ఎవరికీ దక్కని సన్మానాలు… ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎదుర్కొని, పరిష్కరించుకుని, అనుభవించిన చరిత్ర! సత్యాన్ని ఎవరూ దాచలేరు… సత్యం వెనుకే మనం ఉండిపోవడంతో అది సాక్షాత్కరించదు… అంతే! అలాగే, కష్టం వెనుకే ఫలితం ఉంటుంది… అది పడిన కష్టానికి అనుగుణంగానే ఉంటుంది… ఇక వినయ విధేయతలు తోడైతే… రాజకీయ రంగంలో మరింత శోభనిస్తుంది… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది మరోసారి అక్షర సత్యమైంది. అనుభవానికి తోడు పాలనలో అధినేతకు చిత్తశుద్ధి ఎంత అవసరమో ఓటర్లు చాలా చక్కగా గుర్తించారు. అపూర్వ రీతిలో అఖండ మెజారిటీతో చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించారు. ఇది రాజకీయ యవనికపై తాజా అధ్యాయం! గత అనుభవాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. ఎంతో ఓపిగ్గా ప్రతి అంశాన్నీ బేరీజు వేసుకుని మెలుగుతున్నారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా మరోసారి ఆయన వ్యవహారశైలిని గమనించిన ఎంపీలు తమ అధినేత సింప్లిసిటీకి మంత్ర ముగ్ధులయ్యారు. ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయన మనసెరిగిన నేతగా మసిలారు. ఆయన కదలికలు, హావభావాలను గమనించిన ఎంపీలు, ఇతర నాయకులు చాలా ఎమోషనల్‌గా మారడం కనిపించింది. పదవులు, ప్రోటోకాల్స్ వంటివాటిని పక్కనబెట్టి ప్రధాని మోడీతో భేటీ అయిన తీరు చూసి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలని మాట్లాడుకోవడం కనిపించింది.
వ్యక్తిగత భేషజాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సాగుతున్నారని చంద్రబాబు ప్రతి కదలిక చెబుతోంది. రాజకీయంగా నరేంద్ర మోడీ తనకంటే జూనియర్ అయినప్పటికీ, ప్రధానమంత్రి హోదాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, మర్యాద, మన్ననలను పాటిస్తూ, చంద్రబాబు నాయుడు బాడీ లాంగ్వేజ్, హావభావాలను తెదేపా ఎంపీలు ఆశ్చర్యంగా గమనిస్తుండడం కనిపించింది. ఒకప్పుడు ఎన్డీయేను శాసించిన అనుభవం ఆయనది… మరోపక్క నేడు కూడా ఆయనే ఎన్డీయే మనుగడకు కీలకం… అయినప్పటికీ, అణువంతయినా గర్వం, దర్పం చూపించకుండా చంద్రబాబు నాయుడు ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు చూసి సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే ఫిదా అయ్యారని చెబుతున్నారు.
ఎక్కడా రాజకీయాలు మాట్లాడవద్దు… పదవుల అంశాలను చర్చించవద్దు… మనకు మన రాష్ట్రమే ముఖ్యం… మన రాష్ట్ర భవిష్యత్తే కీలకం… ఇవన్నీ సదా గుర్తుంచుకుని మెలగాలని తెలుగుదేశం ఎంపీలకు అధినేత చంద్రబాబు హితవు పలికారు. అంతేకాదు… ఇదే అంశాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా వారి వద్ద రిపీట్ చేయడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతకు నిదర్శనమని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు.
వయస్సు, అనుభవం, హెదా, చివరకు తన మద్దతే కీలకమన్న అంశాన్ని కూడా పక్కనబెట్టి కేవలం తన రాష్ట్రానికి కావాల్సిన ఆర్ధిక సాయం, తదితర అంశాలనే ఎంతో ఆతృతగా, ఆసక్తిగా, అణకువగా ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ప్రతి మాటను ప్రధాని నరేంద్ర మోడీ ఓపిగ్గా విని, భరోసా ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీవంటి నేత దొరకడం నిజంగా అదృష్టం అని భుజం తట్టి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని మోడీ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా భుజం తట్టడంతో చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఎమోషనల్‌గా నడుం వంచి ఆయనతో కరచాలనం చేశారు. మోడీతో భేటీ ముగిసిన తర్వాత ఎంతో సంతృప్తిగా కనిపించిన చంద్రబాబులో ఎంతో జోష్ కనిపించింది.
ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని పదవులకు డిమాండ్ చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతోంది. ఎన్డీయే ప్రభుత్వానికి నితీష్ మద్దతు కూడా కీలకమే. ఆయన అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పలు డిమాండ్లను ప్రధాని నరేంద్ర మోడీ ముందు పెట్టారు. మరోవైపు ఇండియా కూటమి దీటైన ప్రతిపక్షంగా పార్లమెంటులో ఆవిర్భవించింది. నిన్నటివరకూ జరిగిన లోక్‌సభలో సాక్షాత్తూ ప్రధాని మోడీనే పలుసార్లు కల్పించుకుని విపక్షాల సవాళ్లకు బదులివ్వాల్సి వచ్చింది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు తెలుగుదేశం మద్దతు ఎంత అవసరమో రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇంత కీలక సమయంలో రాజకీయ లబ్ది కానీ, పదవుల కోసం డిమాండ్లు కానీ పెట్టకుండా కేవలం తన రాష్ట్ర బాగోగుల కోసం ఫైళ్లు పట్టుకుని రావడం, తనకు ఇవే కీలకమని విన్నవించడంతో నరేంద్ర మోడీ కించత్ ఆశ్చర్యానికి గురయినట్టు సమాచారం. ఇంత పెద్ద కీలక నేత ఎంతో వినయంగా ఆయా అంశాలపై పూర్తి నిబద్దతతో ప్రయత్నిస్తున్న తీరు కూడా ప్రధానిని ఆకర్షించిందని చెబుతున్నారు. ఎంతో హుందాగా చంద్రబాబు నాయుడు రాజకీయాలను ప్రస్తావించకుండా రాష్ట్ర అవసరాలనే ప్రస్తావించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.