సోంపేట (శ్రీకాకుళం జిల్లా) ఆంధ్రప్రభ స్మార్ట్, :ఉత్తరాంధ్ర అంటేనే వెనుకపడిన ప్రాంతం. చదువులు సరిగా లేక.. ఉపాధి మార్గం దొరక్క వలస జీవుల వేదికగా మారింది. ఇలాంటి స్థితిలో ఓ త్రీ ఈడియట్స్ చేసిన ఘనత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వాళ్లు ఇప్పుడు నిరుద్యోగులకు హీరోలుగా నిలిచారు. చదువులమ్మ ఒడిలో త్రిమూర్తులుగా మారారు. ఈ ముగ్గురి ఆలోచన ఎంతోమంది జీవితాలకు మార్గం చూపింది.. చదువుకు దూరమైన చిన్నారులకు అక్షర దీపంలా వెలుగునిచ్చింది.. ‘మీ కోసం మేమంటూ’ ఆపన్నహస్తం అందించింది.
ఉద్యోగ, ఉపాధి వైపు అడుగులు వేయించింది.. ముగ్గురితో మొదలైన ఈ సేవాగుణం.. సేవక సైన్యంగా మార్చింది.. 17 ఏళ్లుగా వేలాదిమందిని చదువుల గుడికి చేర్చుతూ ఉద్దాన సీమలో ఆదర్శంగా నిలుస్తోంది ఉయ్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ..
మేమున్నామంటూ… నిరుద్యోగులకు ఆసరాఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా చదువులకు స్వస్తి చెబుతున్న పరిస్థితుల అనుభవాలకు చలించిపోయారు. కదిలిపోయారు. మనోళ్లు చదవలేరా? ప్రతిభ లేనోళ్లా? వీళ్లకు ఉద్యోగాలు రావా? కాదు వీళ్లకు సదుపాయాలు లేవు.. చదువులో సానపడితే ఈ నేలలోని టాలెంట్ దేశ విదేశాలకు వ్యాపిస్తుంది, అని సోంపేట యువకులు డొంక జోగారావు, లొట్ల పీతాంబరం, బంగారు సతీష్ ఆలోచించారు.
ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదనే ఆలోచనతో 2008లో ఉయ్ ఫర్ యూ అనే పేరుతో సేవా సంస్థను స్థాపిచారు. తొలుత 14 మంది సభ్యులతో ప్రారంభమైంది. వీరంతా నెలకు రూ.100లు చొప్పున చందాలు వేసుకొని నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఆర్థికసాయం అందించారు. వీరి సేవాగుణం ప్రజల్లోకి వెళ్లింది. నిరుపేద చిన్నారులకు అండగా నిలిచింది. దీంతో మేము సైతం మీతో అంటూ రెండో ఏడాదికే సభ్యుల సంఖ్య సెంచరీ కొట్టింది.
దత్త బిడ్డల విద్యాభివృద్ధికి ప్రముఖులు సైత భరోసా కల్పించటం ప్రారంభించారు. నిరుద్యోగుల కోసం.. 24 గంటల లైబ్రరీ ఈ సంస్థ కేవలం నిరుపేద విద్యార్థుల సాయంతో ఆగిపోలేదు. నిరుద్యోగ యువత కోసం 2013లో వివేకానంద డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చారు.
రూ 40 లక్షల వ్యయంతో అద్దె భవనంలోని గ్రంథాలయానికి సొంత భవనాన్ని సమ కూర్చారు. ఉద్యోగ పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ లైబ్ర 24 గంటలూ సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. నిత్యం వంద మందికి పైగా యువత ఈ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు డాక్టర్లు పిజీ ఎంట్రెన్స్ పరీక్షలకు ఇక్కడే ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు.
బ్యాంకు పీవోలు,క్లర్క్ లు అధ్యాపకులు, రైల్వే, ఏపీపీఎస్సీ, తపాలా, సచివాలయం, కానిస్టేబుల్, డీఎస్సీ తదితర ఉద్యోగ పోటీ పరీక్షలకు ఇక్కడ సాధన చేసే 40 మంది వరకు ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు వీరంతా సంస్థ సభ్యులుగా మారి సాయం అందిస్తున్నారు.
ఏటా గ్రంథాలయ నిర్వ హణకు రూ.2 లక్షలు, పేదల చదువులకు రూ.3.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఓ వైపు ఆర్థికసాయం చేస్తూనే సంస్థ సభ్యులుగా ఉన్న వైద్యులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్నారు.
పేదల కోసం వైద్యసాయమే కాక అత్యవసర పరి పరిస్థితుల్లో రక్తదానం చేస్తూ ఉద్యోగులు, ప్రాణం పోస్తున్నారు.
సామాజిక స్పృహతో.. టీచర్లే ..
..ఈ సంస్థలో ప్రస్తుతం 320 మంది సభ్యులుంటే అందులో 240 మంది వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులే ఉన్నారు. వీరంతా ఆర్థికపరమైన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నెలకు రూ.100లు బ్యాంకు నుంచి నేరుగా సంస్థ ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభ్యుల్లో 274 మంది నెలకు రూ.100 సాయం అందిస్తుండగా కొందరు వైద్యులు, అధ్యాపకులు, వ్యాపారులు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మందికి విద్యార్థుల చదువులకు సంస్థ అండగా నిలిచింది.
ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, డీఈడీ చదువుతున్న విద్యార్థులకు పెద్ద మొత్తం లో సాయం అందించారు. నిరుద్యోగ యువత ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని సోంపేట పట్టణానికి చెందిన డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్ సహా సభ్యులు సహకారంతో స్వచ్ఛంద సంస్థలో గ్రంథాలయం ఏర్పాటు చేసి 24 గంటలు పని చేస్తున్న గ్రంథాలయంలో డిజిటల్ గ్రంధాలయంగా తీర్చిదిద్దటమే కాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు మెటీరియల్ అందుబాటులో ఉంచారు.
ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు మొదలు పోటీ పరీక్షలకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు ప్రతిభావంతులను ఎంపిక చేసి సంస్థ తరఫున సాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
చదువుకు పేదరికం శాపం కాదు :
పేదరికం చదువుకు శాపం కాకూడదు, మేము అనుభవించిన కష్టాలు ప్రతిభ శీల పేద విద్యార్థులు ఆ బాధ పడకూడదు. ఈ లక్ష్యంతో 17ఏళ్ళు కిందటి ఆలోచనకు ఎందరో ప్రముఖులు భాగస్వాములు కావడం సంతోషం. ప్రతి ఏడాది రూ. 3 లక్షలకు పైగా వ్యయంతో పేద విద్యార్థుల చదువులకు సహకారం అందిస్తూ.. వెయ్యి మంది విద్యార్థులను దత్తత తీసుకున్నాం. ఇందులో 50 మంది విద్యార్థులు స్థిరపడ్డారు. వివిధ రంగాలలో , 40 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యంతో 24 గంటలూ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెచ్చాం. సంఘ సభ్యులు సహకారంతో సొంత భవనాన్ని నిర్మించాం, నిరుపేద వర్గాల విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా నిలవడం సంతృప్తినిచ్చింది. రానున్న కాలంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
.= డొంక జోగారావు , ఉయ్ ఫర్ యూ వ్యవస్థాపకుడు.. సోంపేట