Tuesday, November 19, 2024

Top Story – వంద రోజుల టార్గెట్! గంజాయి మాఫియాపై ఉక్కుపాదం

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి బ్యూరో : శ్రీ సత్య సాయి జిల్లాలో అత్యంత ప్రమాదకర మత్తు పదార్థం గంజాయి అమ్మకాలు, వాడకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి మత్తుకు యువకులు, కార్మికులు బానిసలుగా మారి తమ విలువైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లా లో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో నివారణ చర్యల్లో పోలీస్ యంత్రాంగం విఫలమైందనే విమర్శలు తప్పటం లేదు. అసలు గంజాయి ఎక్కడ నుండి వస్తోంది,? ఎవరు అమ్ముతున్నారు? ఏమిటి అనే విషయాలపై పోలీసు నిఘా విఫలమైందందే కేవలం ఆరోపణ కాదు. నిఘా లోపంతోనే గంజాయిఅమ్మకం పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, మడకశిర ప్రాంతాలలో గంజాయి వినియోగం అధికంగా జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం, పెనుకొండ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో కార్మికులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఇందులో అత్యధికం మంది వలస కార్మికులు. ముఖ్యంగా ఒరిస్సా, బీహార్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు శ్రీ సత్య సాయి జిల్లాలో అటు పారిశ్రామిక రంగంలోనూ, ఇటు నిర్మాణ రంగంలోనూ అత్యధికంగా పనిచేస్తున్నారు. వీరంతా శ్రమ జీవులు కారణంగా తరచూ గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఈ మత్తులోనే అఘాయిత్యాలు

మత్తుకు బానిసలుగా మారిన యువకులు పలు అఘాయిత్యాలకు పాల్పడినఘటనలు అనేకం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. హిందూపురం రూరల్ పరిధిలోని గొల్లపురానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఉండి సతీష్ అనే యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడు బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే హిందూపురం పట్టణంలో లేపాక్షి కి చెందిన ఒక యువకుడిని అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గంజాయి మత్తులోనే చితకబాది అతని వద్ద కొంత నగదు తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. గత ఏడాది రైలులో రవాణా అవుతున్న గంజాయిని స్థానిక రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకోగా అందులో హిందూపురం పట్టణానికి చెందిన యువకుడి పాత్ర ఉందని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాలలో గంజాయి బానిసలుతమ వద్ద డబ్బులు లేనప్పుడు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి పైన, ఒంటరిగా ఉన్న వారి పైన దాడులకు పాల్పడుతున్నారు.

పారిశ్రామిక వాడలలో….

ప్రముఖ వ్యాపార పారిశ్రామిక కేంద్రం హిందూపురం, పెనుకొండ ప్రాంతంలో గంజాయి వాడకం అధికంగా ఉందని తెలుస్తోంది. పట్టణాల్లోని యువత, గ్రామీణ వాసులు, పారిశ్రామిక వాడ కార్మికులు గంజాయి వ్యసనంలో కూరుకుపోతున్నారు. గత పాలకులు గంజాయి అరికట్టే విషయంలో తగిన శ్రద్ధ చూపకపోవడంతో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, వాడకం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కర్ణాటక సరిహద్దు ప్రాంతం మడకశిర నియోజకవర్గం ఆయా మండలాల పరిధిలోని గ్రామాలలో గుట్టుగా గంజాయి పంట సాగు సైతం జరుగుతోందని తెలిసింది. ఇదివరకు రొళ్ళ, అమరాపురం మండలాల పరిధిలో గంజాయి సాగుకు సంబంధించి రైతులు పైన పోలీసులు కేసులు సైతం నమోదు చేసిన విషయం తెలిసిందే.

యథేచ్చగా రవాణా

గంజాయి రవాణా జిల్లాలో యదేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైలు, బస్సుల్లో సంచుల్లో పెట్టుకొని కొంతమంది, ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్ల ద్వారా, బిచ్చగాళ్ళ ద్వారా కిలోలు కిలోలు గంజాయి జిల్లాకు చేరుతోంది. అదేవిధంగా జిల్లా మీదుగా బెంగళూరు, చెన్నై వంటి నగరాల కు సైతం రవాణా సాగిస్తున్నారు. గతంలో కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఒక కంటైనర్ లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్లు విలువ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఐదు నుంచి పది కిలోల గంజాయిని అనేక సందర్భాలలో జిల్లాలోని పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా కదిరి, హిందూపురం, ధర్మవరం పెనుకొండ ప్రాంతాలలో గంజాయి కేసులు అనేకం నమోదయ్యాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ లో, చాయ్ కేంద్రాలు కొన్ని ప్రాంతాలలో కళాశాలల వద్ద,ప్రధాన జంక్షన్ల వద్ద గంజాయి అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

చాయ్ సెంటర్లే అడ్డాలు

శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వివిధ కంపెనీల చాయ్ కేంద్రాలు గంజాయి కి అడ్డాగా మారాయి అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, ధర్మవరం కదిరి పట్టణాలలో ఇటీవల కాలంలో చాయ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. హిందూపురంలోని బెంగళూరు రోడ్డు, పరిగి రోడ్డు, అనంతపురం రోడ్డు, అదేవిధంగా కదిరి రోడ్డు ఇంకా లేపాక్షి రోడ్డు లలో అనేక కంపెనీలకు చెందిన చాయ్ కేంద్రాలు వెలిశాయి. అదేవిధంగా పెనుకొండ, ధర్మవరంలోనూ చాయ్ కేంద్రాలు అనేకం వెలిశాయి. కదిరిలో మదనపల్లి రోడ్డు, హిందూపురం రోడ్డు, అనంతపురం రోడ్డు లలో కనీసం ఒక్కొక్క రోడ్డుకు ఐదు ఆరు పెద్ద పెద్ద చాయ్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు తిప్పరా మీసం, చాయ్ జాయ్, బిగ్ బాస్ చాయ్, టీ అండ్ టీ , మిస్టర్ టీ ఇంకా స్థానికంగా వివిధ పేర్లతో తేనేటి కేంద్రాలు నిత్యం జనం తో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యువత అధికంగా చాయ్ కేంద్రాలలో గంటల తరబడి ఉంటూ వస్తున్నారు. అక్కడే గంజాయి కి సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలతో ..

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సమస్యను దృష్టిలో పెట్టుకొని, నూతనంగా రాష్ట్ర డీజీపీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు గంజాయి నివారణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవలనే తిరుపతి లో రాష్ట్రస్థాయిలో ఎస్పీల సమావేశం నిర్వహించారు. గంజాయి పై ప్రత్యేకంగా చర్చించారు. గంజాయి అరికట్టడం కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి, వంద రోజులు పాటు ఇదే సమస్యపై నిఘా పెట్టి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని గంజాయిని నివారించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను తక్షణం చేపట్టి వెంటనే రంగంలోకి దిగి గంజాయి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరగాలని డీజీపీ ఆయా జిల్లా ఎస్పీలను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆ దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాకు నూతన ఎస్పీగా వి రత్నాను నియమించారు. ఇక్కడ ఉన్న ఎస్పీ మాధవరెడ్డిని మన్యం జిల్లా పార్వతీపురానికి బదిలీ చేశారు. నూతన ఎస్పీ వి రత్న బుధవారమే పదవి బాధ్యతలు చేపట్టారు. పోలీస్ వ్యవస్థ పై నమ్మకం పెంచేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. మరి నూతన ఎస్పీ వి రత్న ఆధ్వర్యంలో జిల్లాలో గంజాయి నివారణకు 100 రోజుల టార్గెట్ లో గంజాయి విక్రదారులను గుర్తిస్తారా? పెడ్లర్లను పట్టుకుంటారా? ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా వంద రోజుల్లో గంజాయి మాఫియా భరతం పడితే.. మామూలు విశేషం కాదు. పోలీసు చరిత్రలోనే … సరి కొత్త అధ్యాయం కాగలదంటే అతిశయోక్తి కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement