Friday, October 4, 2024

Top Story – ఏపీకి పున‌ర్ వైభ‌వం – ఖ‌నిజం … ప‌వ‌నిజం

ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, అనంతపురం:దేశంలోనే తీవ్ర వర్షాభావ ప్రాంతాల్లో అనంతపురం రెండవ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ సహజ సంపదకు ఏమాత్రం కొదవలేదు. ఫ్యాక్షన్ గొడవలను పక్కనపెట్టి గడిచిన దశాబ్ద కాలంగా రైతాంగం పండ్లతోటలతో మేలైన దిగుబడి సాధిస్తూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. బత్తాయి బొప్పాయి దానిమ్మ కర్బూజా డ్రాగన్ ఫ్రూట్ ఇలా అనేక రకాలైన పండ్లతోటల సాగుతో ప్రతిష్టను పెంపొందించుకుంది.

అయితే.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొర‌వ‌తో ఏపీలో ప‌రిశ్ర‌మ‌లు పున‌ర్ వైభ‌వం సంత‌రించుకోనున్నాయి. పారిశ్రామిక వేత్త‌ల‌కు ఫ్యూచ‌ర్‌పై భ‌రోసా ఇస్తే చాలు.. ఇటు ఉపాధికి ఉపాధి.. అటు ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మకూరే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.సహజ వనరులకు కొరతలేదు పేరుకు మాత్రం అనంతపురం కరువు జిల్లా. ఇక్కడ సహజ సంపద వల్ల అనేక పరిశ్రమలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. లిటిగేషన్ సమస్యల కారణంగా కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి.

ఒకప్పుడు దేశంలోనే అత్యధిక క్వాలిటీ ఇనుప ఖనిజంగా ఉన్న ఓబులాపురం మైన్స్ మళ్లీ తెరుచుకొని దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి ప్రభుత్వ సహకారం అందించాల్సిన అవసరం ఉంది. 2010లో ఓఎంసీ మూతబడింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గొడవల వల్ల ఓబులాపురం మైనింగ్ మూతపడింది. మైనింగ్ తవ్వకాల్లో అనేక అక్రమాలు జరిగాయని అప్పట్లో సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు వివాదాన్ని తొలగించడానికి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వే బృందాలు హద్దులు గుర్తించే పనిలో ఉన్నాయి. ఈ వివాదం సమిసిపోతే బి ఐ ఓ బి సిద్దాపురం, బివైఎం, ఓఎంసీ అంతర్గంగా, జి ఆర్ ఆర్ తదితర మైనింగ్ లీజుదారులు తిరిగి ఇనుప ఖనిజం తవ్వకాలను ప్రారంభించే అవకాశం ఉంది.

చిన్న ప‌రిశ్ర‌మల‌పై పెద్ద దెబ్బ‌..

- Advertisement -

2010 నుంచి తవ్వకాలు నిలిచిపోవడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని చిన్నాచితకా పరిశ్రమలు ముడి సరుకు లేక మూత పడిపోయాయి. ప్రధానంగా లక్ష్మీ వెంకటేశ్వర రాక్స్ స్టీల్ బిఐఓబి ఎస్ ఎస్ పి ఎస్ ఎల్ వి ఆపిల్ తదితర ఇనుప ఖనిజం పరిశ్రమలు ఓఎంసీ ముడి సరుకు పై ఆధారపడింది. అయితే పరిశ్రమలకు ముడి సరుకు లేక కొందరు ఇబ్బందులు పడుతుండగా మరికొందరు కర్ణాటక నుంచి తెచ్చుకొని స్టీల్ ఉత్పత్తి చేసుకుంటున్నారు. వీటి ద్వారా వేలాదిమంది లారీ యజమానులు, డ్రైవర్లు, హోటల్లు ఇలా అనేక రకాలైన వ్యాపారాలు సాగేవి. ఇవి మూతపడిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం స్మశాన వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం తిరిగి సర్వే ప్రక్రియ ను అధికారులు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సర్వేలు ముగించి తిరిగి తవ్వకాలకు అనుమతి ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎంతో దోహదపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

వజ్రాల నిధి

వజ్రకరూర్ జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో వజ్రకరూరు మండల కేంద్రంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పొలాల్లో వజ్రాలు బయట పడుతుంటాయి. రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి వర్షాకాలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ వజ్రాల అన్వేషణ భూగర్భంలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలో మిగిలిన చాలా ప్రాంతాల్లో వజ్రాలు లభించే ప్రాంతాలుగా గుర్తించారు. ఈ అన్వేషణ మరింత ముందుకు సాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.

రామగిరి బంగారు గనులు

రాప్తాడు నియోజకవర్గం లోని రామగిరి బంగారుగనులను గతంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైండ్ సంస్థ లీజుకు తీసుకొని చాలాకాలం బంగారాన్ని వెలికి తీసింది. ఖర్చులు అధికం కావడంతో సమస్త రామగిరి గోల్డ్ మైండ్ ను మూత వేసింది. అయితే గత ప్రభుత్వంలో గోల్డ్ మైన్ తెరిపించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులను పిలిపించి పరిశోధన చేయించారు. గోల్డ్ మైన్ తిరిగి ప్రారంభమైతే రామగిరి ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుంది.

సిమెంటుకు కేరాఫ్ తాడిపత్రి

సిమెంట్ పరిశ్రమలకు కేరాఫ్ తాడిపత్రిగా రికార్డులకు ఎక్కింది. తాడిపత్రిలో ప్రస్తుతం పెన్నా సిమెంట్స్, సాగర్ సిమెంట్, ఆదిత్య బిర్లా లాంటి సిమెంట్ పరిశ్రమలు విరివిగా ఉన్నాయి. ఇవే కాకుండా సుద్ద, నాపరాయి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వీటికి సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యం, ఇతర ఆర్థిక చేయూతలేక కొన్ని కాయిలా పడిన పరిశ్రమలుగా మారిపోయాయి. ప్రభుత్వం ఈ పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తే అన్ని రకాల ఆదాయం వనరులు పెరగనున్నాయి

. జిల్లాలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించి కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురాగలిగితే ఐదు సంవత్సరాల్లో ఆదాయ వనరులను అందించడంలో అనంతపురం అగ్రగామిగా నిలిచిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement