న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ర్టపతి ప్రసంగంలో పేర్కొన్నట్లు 2047 నాటికి ఆధునిక, అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే రాష్ర్ట ప్రభుత్వాలదే కీలక భాగస్వామ్యమని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రాష్ర్టపతి ఆశిస్తున్నది సాధించేందుకు అడ్డంకిగా, అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ వాపోయారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌ను సైతం ష్యూరిటీగా పెట్టి అప్పులు చేస్తున్నారని, డబ్బుల కోసం పేదలు ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు కూడా వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ. 10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అప్పుల కోసం రానున్న పాతికేళ్ళలో మద్యంపై ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అప్పులు లేకుండా రోజు గడవని పరిస్థితి ఏపీదని కనకమేడల ధ్వజమెత్తారు. గత రెండున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం రూ. 3,50,000 కోట్ల అప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి దాపురించిందని, కొత్త పీఆర్సీ కారణంగా గతం కంటే తక్కువ జీతాలు పొందుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ర్టపతి ప్రసంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని కనకమేడల రవీంద్ర కుమార్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,