తిరుమల, ప్రభ న్యూస్ ప్రతినిధి : భక్తుల సౌకర్యార్ధం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో గదుల కోటాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 16 న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను ఈనెల 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్‌చేసుకునేందుకు అర్హులు.
అదేవిధంగా తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారిసేవ, నవనీతసేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణిసేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులు బుక్ చేసుకోవచ్చు.
27న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 27వ తేదీ సోమవారం పరిపాలనా కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. కావున 26వ తేదిన సిఫారసు లేఖలు స్వీకరించబోరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా ఒక ప్రకటనలో కోరింది.