ప్రత్యేక విమానంలో బయలుదేరిన నిర్మాతల బృందం
సీని రంగం ఇబ్బందులపై ఉపముఖ్యమంత్రితో చర్చ
గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని కోరే అవకాశం
పవన్ సానుకూల స్పందనకు టాలీవుడ్ ఎదురు చూపులు..
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రభుత్వం మారిపోయింది. కూటమి.. పవర్ లోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మినిస్టర్లు, ఉప ముఖ్యమంత్రి.. ఇలా అందరూ ప్రమాణస్వీకారాలు కూడా చేసేసారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో.. కూడా సినిమా వాళ్లకి మంచి రోజులు వచ్చాయి అన్నమాట ఎక్కువగా వినిపిస్తోంది.
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నడిచినప్పుడు తెలుగు నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. తమ ఇబ్బందులను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొందరు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి అశ్విని దత్, హారిక హాసిని క్రియేషన్స్ నుంచి చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్, రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపున విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి దానయ్య లతో పాటు తెలుగు ఫిలిమ్స్ అంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర ప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు.
విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈ మీటింగ్ జరగబోతోంది. కొత్తగా పవర్ లోకి వచ్చిన కూటమికి.. నిర్మాతలు అభినందనలు కూడా తెలుపనున్నారు. ఈ మీటింగ్ లో నిర్మాతలు గత ప్రభుత్వంలో వాళ్లు ఎదుర్కొన్న ముఖ్య ఇబ్బందుల గురించి వివరించి, ప్రస్తుతం తమకున్న సమస్యలను కూడా తెలియజేయబోతున్నారు. అంతేకాకుండా తమ సమస్యలకు.. పరిష్కారం చూపించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్నారు.
ఈ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాతలు చెప్పిన విషయాలను ఆలోచించి, వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే కూటమి పవర్ లోకి వచ్చాక సినిమా వాళ్లకి బాగా మంచి జరుగుతుంది అని అందరూ అనుకుంటూ వచ్చారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో, తెలుగు నిర్మాతలకి ఎంతవరకు మంచి రోజులు వచ్చాయో వేచి చూడాలి.
అయితే ఇండస్ట్రీలో ఒక హీరోగా కూడా పవన్ కళ్యాణ్ కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇబ్బందుల గురించి మంచి అవగాహన ఉంది. మరి పవన్ కళ్యాణ్ హయాంలో ఇప్పుడు వారికి ఎంతవరకు ఉపశమనం లభిస్తుందో అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక విమానంలో..
డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిని సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరారు. చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, కనుమూరి రఘురామకృష్ణంరాజు (ఉండి ఎమ్మెల్యే) స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరగా.. మిగిలిన నిర్మాతలు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి ప్రయాణం అయ్యారు.