అమరావతి, అంధ్రప్రభ : పొగాకు ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులు పెట్టుకొన్న ఆశలు ఆవిరవుతున్నాయి. పంట దిగుబడి కూడా అం తంత మాత్రమే కావడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పొగాకు పంట ప్రధానంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సాగు చేస్తారు. ఈ ఏడాది పది వేలకు పైగా ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారు. కేఎస్ఫీ, వీఎస్టీ, జీపీఐ, బొమ్మిడాల ఐటీసీ తదితర కంపెనీలు పొగాకు కొనుగోలు ప్రారంభించారు. ప్రతి ఏడాది అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేసేవారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పంట విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్లు వచ్చిందని రైతులు తెలిపారు. అయితే మార్కెట్లో క్వింటా పొగాకు రూ.10,500 ఉండగా.. రైతుల వద్ద రూ.8 వేల నుంచి 9వేల దాకా కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు రూ.11వేలు గిట్టు బాటు ధర కల్పిస్తే బావుంటుందని రైతులు కోరుతున్నారు.
ఈ ఏడాది పంటపై పెట్టిన పెట్టు-బడి అధికంగా వచ్చిందని, ఎరువులు క్రిమిసంహారక మందుల ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా రూ.11 వేలు క్వింటం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొగాకు పంట సాగు చేసినప్పటి నుంచి కూలీలకు, తోరణాలు, షెడ్ల ఏర్పాటుకు వేల రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఏటా అక్టోబరు, జనవరి నెలల్లో పొగాకును తొలగించి తోరణాలు కట్టి సుమారు 30 రోజుల పాటు పొగాకును పొగలో ఉంచాలి. చివరి రోజున నీటితో స్ప్రే చేయాలి. దీంతో ఖర్చులు పెరుగుతాయి. అయితే ఈసారి పురుగు దెబ్బతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దళారుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కంపెనీలు నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తే బావుంటుందని పొగాకు రైతులు కోరుతున్నారు. దళారుల వ్యవస్థను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కష్టమంతా వృథా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పొగాకు దిగుబడి రాలేదు. పంటపై పెట్టుబడులు పెరిగాయి. ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీల రేట్లు అధికమ య్యాయి. గిట్టుబాటు ధర లేదు. క్వింటం రూ.11వేలకు పైగా ధర పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..