Monday, November 25, 2024

Big Story: పొగాకు.. ఈసారైనా లాభాలు తెచ్చేనా?

అమరావతి, ఆంధ్రప్రభ : గడిచిన రెండేళ్లుగా రైతులకు తీవ్ర నష్టాలు మిగిలిస్తున్న పొగాకు కొనుగోళ్ల‌ ప్రక్రియ ఈ సీజన్‌ లో ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా కందుకూరులో వేలం కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. పెరిగిన సాగు వ్యయం, వాతావరణ ప్రతికూలత వల్ల అనూహ్యంగా పెరిగిన పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కిలో కనిష్ట ధర రూ.175-180 మధ్య ఉండేలా చూడాలని రైతులు అటు ట్రేడర్లనూ, పొగాకు బోర్డునూ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ అంతా ఒకే కంపెనీ కనుసన్నల్లో నడుస్తున్నందున మార్క్‌ ఫెడ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన కూడా వేలంలో పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంలో పొగాకు బోర్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేయాలనీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రేడర్లతో చర్చించాలని పొగాకు రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ సీజన్‌ లో తొలివిడతగా దక్షిణాది నల్లరేగడి నేలలు (ఎస్‌ బిఎస్‌), దక్షిణాది తేలికపాటి నేలల (ఎస్‌ఎల్‌ఎస్‌) పరిధిలో పండించిన ఏడు వేలం కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంబించారు. ఎస్‌.బి.ఎస్‌, ఎస్‌.ఎల్‌.ఎస్‌ పరిధిలోని నెల్లూరు జిల్లాలోని డీసీ పల్లితో పాటు- ఒంగోలు-1, కొండెపి, వెల్లంపల్లి, పొదిలి, కందుకూరు-1,2 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించారు. మార్చి 28 నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఒంగోలు-2, టంగుటూరు-1, కనిగిరి, కలిగిరి కేంద్రాల్లో వేలం కేంద్రాల్లోనూ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి..

తగ్గిన ఉత్పత్తి..ధరలు పెరుగుతాయా..!
దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌, ట్రేడర్ల ఆర్డర్లను దృష్టిలో ఉంచుకుని సాగు విస్తీర్ణాన్నీ, ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రతి ఏటా పొగాకు బోర్డు నిర్ణయిస్తుంది. పొగాకుబోర్డు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యానికి మించి పండిస్తే ఆ రైతులు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యానికి మించి పొగాకును పండించటం పరిపాటిగా కొనసాగుతోంది. అలాంటిది..ఈ ఏడాది మాత్రం లక్ష్యానికి కన్నా 10.69 మిలియన్‌ కిలోల ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. అధికారిక లెక్కల ప్రకారం ఎస్‌.బి.ఎస్‌, ఎస్‌.ఎల్‌.ఎస్‌ నేలల్లో ఈ ఏడాది 79.10 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతివ్వగా 68.41 మిలియన్‌ కిలోల పొగాకు మాత్రమే పండింది. 50,081 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు పండించేందుకు అనుమతివ్వగా 47,507 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు పండిచంగలిగారు. ప్రతి ఏటా కొనసాగుకే తంతుకు విరుద్ధంగా లక్ష్యానికి మించి విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గటం రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టటంతో ఎగుమతులకు అడ్డంకులు దాదాపు తొలగిపోయాయనీ, దేశీయంగా కూడా అవసరాలు పెరిగితే డిమాండ్‌-సప్లయ్‌ మార్కెట్‌ సూత్రానికి అనుగుణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాకపోతే..ఏ గ్రేడ్‌ గా భావించే మేలిమిరకం పొగాకు ఉత్పత్తి పరిమాణంపై కూడా ధరలు ఆధారపడతాయి. గత ఏడాది మేలిమి రకం పొగాకు ఉత్పత్తి భారీగా తగ్గుముఖం పట్టటం వల్ల ధరలు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. పొగాకు నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ట్రేడర్లు అనేక సందర్భాల్లో వేలంలో పాల్గొనకపోవటంతో వేలం కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ను రంగంలోకి దింపి పొగాకును కొనుగోలు చేయించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా నమమే అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో మేలిమి పొగాకు పండలేదనీ.. మొత్తం పరిమాణంలో 50 శాతానికి మించి అత్యంత నాణ్యతగల పొగాకు ఉండకపోవచ్చని అంచనా. గత ఏడాది వచ్చిన వరదలు, తుపానులు, రకరకాల తెగుళ్ళు పొగాకుకు శాపంగా మారాయి. ఏదిఏమైనా గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఒక ఎకరా విస్తీర్ణానికి అయ్య పెట్టు-బడి రూ 25 నుంచి రూ 30 వేలు పెరిగినట్టు- అంచనా. ఒక ఎకరాకు కనిష్టంగా రూ 1.1 లక్షలు, గరిష్టంగా రూ 1.4 లక్షలు అయినట్టు- రైతులు చెబుతున్నారు. నల్లరేగడి నేలల్లో 6 నుంచి 8, తేలికపాటి నేలల్లో 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నష్టపోకుండా పొగాకు బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement