Tuesday, July 2, 2024

AP: చంద్రబాబుకు కుప్పంలో సమస్యల స్వాగతం…

కోటి ఆశలతో చంద్రబాబుకు కుప్పం ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు…
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కుప్పం పర్యటన
ఈ పర్యాయం ఖచ్చితంగా శాశ్వత ప్రయోజనలు చేకూర్చే పనులు చేయాలి
సాగు, త్రాగునీటిని అందించే పాలారు ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి
అడవులను సంరక్షణ చేసి ఏనుగుల నుండి ప్రజలను కాపాడాలి
ఐటి హాబ్ గా మారేందుకు కుప్పంలో విరివిగా అవకాశాలు ఉన్నాయి
గ్రామాల్లో మౌళిక వసతులు, పట్టణ సుందరీకరణ పనులు చేయాలి
కుప్పంలో టూరిజం అభివృద్ధికి మెండుగా అవకాశాలు ఉన్నాయి
గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న రౌడీ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలి

కుప్పం, జూన్ 25(ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా రెండు పర్యాయాలు, రాష్ట్ర విభజన అనంతరం రెండు పర్యాయాలు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గం కుప్పంకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిస్తున్న సందర్భంగా అనూహ్య రీతిలో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాదాపు నలభై సంవత్సరాల నుండి కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే అభివృద్ధి పనులు చేయాలని కుప్పం వాసులు కోరుతున్నారు. గతంలో ఉన్న కుప్పం ప్రస్తుతం ఉన్న కుప్పంలో జరిగిన అభివృద్ధిలో తొంబై శాతం మార్పులో చంద్రబాబు నాయుడు ఆలోచనలో భాగంగా జరిగింది. ఈ దఫా ఖచ్చితంగా అన్ని రంగాల్లో వంద శాతం అభివృద్ధి జరిగి చంద్రబాబు నినాదం అయ్యిన భారతదేశంలో కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని కుప్పం ప్రజలు చంద్రబాబును కోరుతున్నారు.

శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి…
కుప్పం నియోజకవర్గంలోని ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కల్పించే పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా సాగు, త్రాగు నీటిని అందించే హంద్రీ, నీవా కాలువ పనులు సంపూర్ణంగా పూర్తి చేసి కృష్ణానది జలాలను కుప్పం నియోజకవర్గ చెరువుల్లో నింపి తద్వారా కుప్పం ప్రజల గొంతు తడపాలి. అదేవిధంగా భారీ స్థాయిలో వృధాగా పోతున్న పాలారు నది జలాలను కుప్పం ప్రజలు సద్వినియోగం చేసుకొనే విధంగా పాలారు ప్రాజెక్టు నిర్మాణం తక్షణమే ప్రారంభించి పూర్తి చేస్తే జీవితాంతం కుప్పం ప్రజలకు సాగు, త్రాగు నీటి సమస్య ఉత్పన్నం కాదు.

కుప్పం అడవులను సంరక్షణ చేసి ఏనుగుల దాడుల నుండి ప్రజలను రక్షించాలి..
కుప్పం నియోజకవర్గంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న అడవుల్లోకి జన సంచారం అధికం కావడం, అక్కడ ఉన్న వృక్ష సంపద, ఇసుకను దోచుకొనేందుకు అటవీ శాఖ అధికారుల సహకారంతో జరిగిన దోపిడీని అరికట్టి వెంటనే అడవుల్లో పచ్చదనం పెంపొందించేందుకు తక్షణ చర్యలు ప్రారంభించి అడవుల్లో నివసిస్తున్న ఏనుగులను అక్కడే కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏనుగులు గ్రామాల వైపు రావడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. అదేవిధంగా అడవుల చుట్టు చంద్రబాబు హయాంలో వేసిన సోలార్ కంచె నిర్వహణ లోపంతో ఎక్కడా పనిచేయట్లేదు. అడవుల్లో ఏనుగులు నివశించేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

కుప్పంలో ఐటి హాబ్ లు ఏర్పాటు కు ఉన్న అవకాశాలు వాడుకోవాలి..
కుప్పం నియోజకవర్గంకు అతి సమీపంలో ఉన్న బెంగళూరు, చెన్నై మహా నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు చేసేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి వేలాది మంది యువతీ యువకులు ఉపాధి కోసం పై పేర్కొన్న మహా నగరాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు మహా నగరాలకు కుప్పం గుండా రైల్వే లైన్ ఉండడం, గంట, గంటకు రైలు నడపటంతో వారు చెన్నై, బెంగళూరు ట్రాఫిక్ ఇబ్బంది దృష్ట్యా కుప్పం లో ఆ సమయంకు సజావుగా పనులు చేసుకోవచ్చు. సరసమైన ధరలకు భవనాలు, మెన్ పవర్, రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా వసతి ఉండడంతో పాటు ప్రశాంతంగా ఉండే వాతావరణం కుప్పంకు సొంతం కావడంతో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయి. కుప్పంలో ఐటి పరిశ్రమలు వస్తే నిరుద్యోగంతో పాటు ఇతర వర్గాలకు ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతాయి.

జాతీయ రహదారులను కలిపే విధంగా సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణం చేయాలి..
కుప్పం నుండి మహా నగరాల జాతీయ రహదారులను అనుసంధానం చేసే విధంగా సుమారు అటు, ఇటు వంద కిలోమీటర్లు నూతనంగా రోడ్డు నిర్మాణం జరిగితే కృష్ణగిరి జాతీయ రహదారి ముంబై వరుకు జాతీయ రహదారుల్లో ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి పలమనేరు వద్ద, బైరెడ్డి పల్లి వద్ద సిక్స్ లైన్ రోడ్డు లింక్ ఉండడంతో కుప్పం నుండి వెళ్లే రోడ్డును సిక్స్ లైన్ రోడ్డుగా మార్చడం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అంతర్ రాష్ట్ర రహదారులున్న వాటి కంటే రెట్టింపు వెడల్పు చేసి నూతన రోడ్లు నిర్మాణం చేయడం ద్వారా పరిశ్రమలు, ఇతర సదుపాయాలు కుప్పంకు రావడానికి అవకాశాలు ఉన్నాయి.

కుప్పంలో విరివిగా పరిశ్రమలు ఏర్పాటు కు మార్గం చూపాలి…
పరిశ్రమల ఏర్పాటుకు కుప్పం నియోజకవర్గం అన్ని విధాలుగా అనువైన ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ స్కిల్, నాన్ స్కిల్ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా భూముల ధరలు తక్కువ ఉండడం, నీరు సంవృద్దిగా దొరకడంతో పాటు తయారు చేసిన వస్తువులను రవాణా చేసేందుకు మహా నగరాలు చెన్నై, బెంగళూరు దగ్గర ఉండడం, కుప్పం నుండి, రోడ్డు, రైల్వే, రాబోయే విమానాశ్రయం సదుపాయాలు ఉండడం వంటి కారణాలతో కుప్పంలో విరివిగా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కుప్పం అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో ఈ ప్రాంతంలోని ప్రజలకు వివిధ మార్గాల్లో ఆదాయం పెరగడం జరుగుతుంది.

కుప్పంలో నూతనంగా పురుడు పోసుకొన్న రౌడీ సంస్కృతికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టాలి…
కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. గత వైకాపా ప్రభుత్వ పాలనలో కుప్పం నూతనంగా రౌడీ సంస్కృతి ని తీసుకురావడంతో ప్రజలు తీవ్ర భయందోళనాలకు గురౌతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గొడవలు, ఆస్తి నష్టం చేసే చర్యలు, బెదిరింపులు వంటి అసాంఘీక చర్యలు అధికం కావడంతో ప్రజలు భయపడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి మళ్ళీ కుప్పంలో ప్రశాంతంగా జీవించే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement