(ఆంధ్రప్రభ స్మార్ట్, తిరువూరు ప్రతినిధి) : జగన్ ను నమ్మి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నట్టేట ముంచాడని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్.. అయిదేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడంలేదని, ఇచ్చిన హామీని ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంపై ఆమె విమర్శల వర్షం కురిపించారు.. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్ గురించి జగన్ ఆలోచించడంలేదన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
రాజధాని ఏది?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో? సీఎంకు తెలియదా.. తెలిసీ ఎలా మరిచిపోయారని ఆమె ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్, ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. ఐదేళ్లు గడిచినా ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారని షర్మిల ఆరోపించారు.
రైతులకు ఇచ్చిన హామీ ఎక్కడ?
ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. కనీసం ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ. 3 వేల కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా? సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మరచి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించని జగన్కు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు.
ఇక తెరమీదకు కాంగ్రెస్ తారాగణం
ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే కాంగ్రెస్ నేతలను పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు షర్మిల ప్రధాన ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక తో సహా 40 మందిని ప్రకటించారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఉన్నారు. వీరితోపాటు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా చోటు లభించింది.
రేవంత్ రాకతో.. వైసీపీకి చుక్కలే.. కూటమికీ దడే
కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం బీజేపీ. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. గతంలో విశాఖలో పార్టీ సభకు హాజరైన రేవంత్ అటు జగన్…ఇటు చంద్రబాబును టార్గెట్ చేసారు. షర్మిల సైతం ఇద్దరు నేతలు మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హోరా హోరీగా మారుతున్న ప్రచారంలో రేవంత్, పార్టీ నేతలు ఏపీలోకి ఎంట్రీ ఇస్తే ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.