ప్రేమ, పెళ్లి పేరుతో అబ్బాయిలు అమ్మాయాలను మోసం చేస్తున్న ఘటనలను చూస్తున్నాం. అయితే, అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారాయి. పెద్దింటి అబ్బాయిలను టార్గెట్ చేసి వల వేసిన ఓ యువతి పెళ్లి పేరు చెప్పి అడ్డంగా వారిని దోచేస్తోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని మోసం చేసిన ఓ మాయ లేడి గుట్టు తిరుపతి పోలీసులు రట్టు చేశారు. మహిళను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ ను సుహాసిని అనే మహిళ తాను అనాధనని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు సునీల్ దగ్గర నుండి రెండు లక్షలు ,పెళ్లి తర్వాత సునీల్ కి తెలియకుండా మామ నుండి రెండు లక్షల రూపాయలు తీసుకుంది. ఈ విషయం తెలిసిన సునీల్ ఆమెను ప్రశ్నించగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇక ఇంటి నుండి వెళ్లేటప్పుడు నగదు, నగలు కూడా తీసుకుని పారిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె మరొక వ్యక్తితో ఉన్న ఆధార్ కార్డు సునీల్ కు దొరకడంతో, ఆధార్ కార్డును తీసుకుని సుహాసినిని సునీల్ నిలదీశాడు. దీంతో తనకు గతంలో పెళ్లి అయినట్లుగా చెప్పి సుహాసిని సునీల్ కు షాక్ ఇచ్చింది. తాను మోసపోయానని గుర్తించిన సునీల్.. పోలీసులను ఆశ్రయించాడు. దాదాపు ఆరు లక్షల రూపాయల మేర నగలు, నగదు తన దగ్గర నుండి తీసుకెళ్లినట్లు గత నెలలో ఫిర్యాదు చేశారు. సునీల్ కంటే ముందు వినయ్ అనే మరో యువకుడిని పెళ్లాడింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురిని మోసం చేసి నగలు, నగదుతో నిత్య పెళ్లి కూతురుగా మారిన సుహాసినిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ఇలాంటి మోసాలకు పాల్పడే వారు ముఖ్యంగా అబ్బాయిలే ఉండేవారు కానీ ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా ఇలాంటి దారుణ మోసాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.