Sunday, January 19, 2025

Tirupati Stampede – కేంద్ర హోం శాఖ యు టర్న్ – తిరుమల పర్యటన రద్దు

న్యూ ఢిల్లీ – తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి పూనుకుంది. వైపరీత్యాల నిర్వహణ విభాగం అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్‌ను తిరుపతికి పంపించాలని తొలుత నిర్ణయించుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ కూడా రాసింది.

- Advertisement -

అమిత్ షా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందీ వైపరీత్యాల నిర్వహణ విభాగం. వైకుంఠ ద్వార దర్శనం టోకెనలను జారీ చేసే కౌంటర్ల వద్ద టీటీడీ అధికారులు ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లు ఎలాంటివి?, తిరుపతి, తిరుమలల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి విధానాలను అనుసరిస్తోన్నారు?, తొక్కిసలాట జరగడానికి దారి తీసిన సంఘటనలు ఏమిటనే విషయాలపై సంజీవ్ కుమార్ జిందాల్.. బీఆర్ నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, ఏఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేష్‌తో సమావేశం కావాల్సి ఉంది.

ఈ నెల 19వ తేదీన సంజీవ్ కుమార్ జిందాల్ ఢిల్లీ నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి, అక్కడి నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వస్తారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షెడ్యూల్ సైతం ఖరారు చేసింది.

20వ తేదీన టీటీడీ అధికారులతో సమీక్ష ఉంటుందంటూ ఈ లెటర్‌లో పేర్కొంది.ఆ తరువాత ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. అనివార్య కారణాల వల్ల తొలుత రాసిన నంబర్ 40-01/2022-డీఎం-ఐ (ఏ) లెటర్‌ను ఉపసంహరించుకుంటోన్నట్లు తెలిపింది. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారికి లెటర్ పంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement