తిరుపతి నవంబరు 8,(ప్రభ న్యూస్ ప్రతినిధి): ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో తిరుపతి ఫారెస్ట్ విభాగానికి చెందిన ఎస్వీ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మాధవరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో గత నాలుగేళ్లుగా అసిస్టెంట్ క్యురేటర్ గా విధులు నిర్వహిస్తున్న మాధవరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నాడని ఏసీబీ ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో విజయవాడకు చెందిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో బుధవారం దాడులు చేశారు..
తిరుపతి రూరల్ చేర్లోపల్లిలో నివాసం ఉంటున్న మాధవరావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ దాడుల్లో మాధవ రావు భారీగా స్థిరాస్తులు కూడబెట్టు కున్నట్టు గుర్తించారు. అందులో మాధవరావు భార్య పేరు మీద చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జి ప్లస్ టు హౌస్ బిల్డింగ్, మాధవరావు పేరు మీద తిరుపతి అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల జి ప్లస్ ఫోర్ భవనం. అన్నమయ్య జిల్లా పుంగనూరు లోని వలపల వారి పల్లి గ్రామం వద్ద ఉన్న 242 చదరపు గజాల జి ప్లస్ వన్ భవనం. రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం, పుంగునూరు మండలం మిలిమి దొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల 09 సెంట్ల వ్యవసాయ భూమిని గుర్తించారు.
దీంతో పాటు చంద్రగిరి నియోజక వర్గం తొండవాడ-1 పాత కాలువ -2 మెండగుంట -1 చొప్పున మాధవరావు,అతడి భార్య పేరిట నాలుగు ఓపెన్ ప్లాట్లు. ఇవి కాకుండా రూ.7లక్షలు విలువ చేసే మారుతి కారు, రూ.1 లక్ష విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు,నగదు రూ.1లక్ష 64 వేల 900 రూపాయలు,1062 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి వస్తువులతో పాటు రూ.20.51 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.4లక్షల బ్యాంకు బ్యాలెన్స్,రూ. 8లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు.సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి