తిరుపతి – కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ రోజు ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐ భూములు, టోల్ ప్లాజాలు, అమృత్ సరోవర్లు సహా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి 300కు పైగా ప్రాంతాల్లో ఒకే రోజులో 2.75 లక్షల మొక్కలు నాటడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పౌరులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నేతృత్వంలో దేశంలోని జాతీయ రహదారులను హరిత రహదారులుగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా మిషన్’కు (జీఐఎం) అనుసంధానంగా ఈ కార్యక్రమం ఉంటుందని గడ్కరీ చెప్పారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో కూలిన ప్రతి చెట్టుకు రెండు రెట్లు ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పూర్తిగా పెరిగిన, పెద్ద చెట్లను తరలించడంలోనూ విజయం సాధించామని చెప్పారు.
వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లకు ఈ కార్యక్రమం ఒక పరిష్కారంలా పని చేస్తుందని, ఏకకాలంలో కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది & పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని గడ్కరీ అన్నారు. మొక్కలు నాటడం, చెట్లు తరలించడం జాతీయ రహదారి అభివృద్ధిలో అంతర్భాగంగా మారాయన్నారు. చెట్ల జియోట్యాగింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, తద్వారా ఈ మొక్కల పెరుగుదలను పర్యవేక్షించవచ్చని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం దీర్ఘకాలం పాటు కొనసాగేలా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గడ్కరీ పిలుపునిచ్చారు.
రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (విశ్రాంత) డా.వి.కె.సింగ్, ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోష్. కుమార్ కూడా ఘజియాబాద్‌లోని దస్నా వద్ద మొక్కలు నాటారు.
కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ ‘హరిత జాతీయ రహదారుల విధానం’-2015ని ప్రకటించింది. దీని ప్రకారం, ‘మొక్కలు నాటే వార్షిక కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా, 2016-17 నుంచి 2022-23 వరకు 3.46 కోట్ల మొక్కలను ఎన్‌హెచ్‌ఏఐ నాటింది. ప్రస్తుత సంవత్సరంలో 56 లక్షలకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. అది ఈ వర్షాకాలం నుంచి ప్రారంభమైంది.
ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే మొక్కల పెంపకం, ఇతర అనుబంధ కార్యక్రమాలు గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికత్వంలోని ‘మిషన్ లైఫ్’, ‘లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’తో అనుసంధానంగా సాగుతున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా, పర్యావరణ అనుకూల ప్రవర్తనను బలపరిచే, పెంపొందించే వ్యవస్థను రూపొందించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రయత్నిస్తోంది.
పర్యావరణహిత జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు మొక్కలు నాటే కార్యక్రమాలను ఎన్‌హెచ్‌ఏఐ తరచూ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాల (ఎస్‌ఆర్‌ఎల్‌ఎంలు) రూపంలో స్వయం సహాయక బృందాలు, అటవీ, ఉద్యానవన నిపుణులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి, జాతీయ రహదారుల వెంబడి సమష్టిగా మొక్కలు పెంచడాన్ని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
Launch of Nationwide Tree Plantation Drive organised by NHAI in Tirupati, Andhra Pradesh. #PragatiKaHighway #GatiShakti #GreenHighways pic.twitter.com/1Swihq7kNs
— Nitin Gadkari (@nitin_gadkari) July 12, 2023