Thursday, November 21, 2024

Tirupathi – పవన్ చెప్పారు – ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు

ఆంధ్రప్రభ స్మార్ట్ – తిరుపతి – తిరుపతి జిల్లా వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తిరుపతి పోలీసులు తక్షణం స్పందించారు.

వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో పోలీసులు మాట్లాడారు. ఆకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. బైక్స్‌పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తున్న ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోకిరీలకు తిరుపతి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేధిస్తున్నవారిని పట్టుకొని కేసులు నమోదు చేసి బైండోవర్ చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.

- Advertisement -

తాము తీసుకున్న చర్యలను డిప్యూటీ సీఎంకు తిరుపతి ఎస్పీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తరుచూ కంప్లైంట్లు వస్తున్నాయని సుబ్బారాయుడికి పవన్ చెప్పారు. రౌడీయిజం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అదుపులో పెట్టాలని పవన్ ఆదేశించారు.

కాగా, తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య డిప్యూటీ సీఎం పవన్‌ను కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని… వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదే విధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకుల వివరాలు, బైక్స్‌పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి అన్నారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement