తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : సత్యసాయి జిల్లా లోని ఒక సామాన్య కుటుంబం పుట్టి స్వయంకృషితో తిరుపతి జిల్లాలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తూ పట్టుదల తో గ్రూప్ 1పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ తో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ అయిన స్వాతి స్ఫూర్తి దాయకమైన ప్రస్థానం ఇది. తమ శాఖ లో ఎస్ ఐ గా పని చేస్తూ డిప్యూటీ కలెక్టర్ అయిన స్వాతి ని ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పరమేశ్వర రెడ్డి ఘనంగా సత్కరించారు.
రాయలసీమ ప్రాంతం లోని సత్యసాయి జిల్లా, హిందూపురం, గురవనహళ్లి గ్రామంలోని ఒకసామాన్య కుటుంబంలో స్వాతి 1993 సంవత్సరంలో జన్మించింది.. బాల్యం నుండే విద్యలో చురుకుగా ఉంటూ ఎం .ఎస్ సి కెమిస్ట్రీ ఎస్వీ యూనివర్సిటీలో అభ్యసించారు. అనంతరం ఎస్సై నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2017 సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగాన్ని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ అయ్యింది. 2018 లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు ప్రొబేషనరీ ఎస్సైగా చేరిన స్వాతి గాజులమండ్యం, శ్రీకాళహస్తి స్టేషన్ లలో పనిచేసి , జిల్లా ఎస్ బి లో ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. 2021 సంవత్సరంలో ఒంగోలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మహే మహేష్ ను పెళ్లాడి, అతని ప్రోత్సాహం తో దాదాపు ఏడాదిన్నర పాటు సెలవు పెట్టి హైదరాబాదులో కోచింగ్ తీసుకుని 2022 సంవత్సరంలో వచ్చిన గ్రూప్-1 పోటీ పరీక్షలు రాసింది. ఆశయ సాధనే లక్ష్యంగా నిబద్ధత, పట్టుదల, కఠోర శ్రమతో అహర్నిశలు కష్టపడి చదివి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలలో రాష్ట్రంలోనే 8 వ ర్యాంకు తో ఉత్తీర్ణత సాధించింది. ఇటీవలే ఇంటర్వ్యూ పూర్తిచేసి తుది ఫలితాలతో స్వాతి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా నియమితులైయ్యారు.
ఈ నేపథ్యంలో తమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఎస్ పి పరమేశ్వర రెడ్డి ఆమెను ఎస్సైగా స్వాతి ని రిలీవ్ చేసి ఆమెను ప్రోత్సహించిన ఆమె భర్తను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనంగా సన్మానం చేశారు. ఆ సందర్బంగా ఎస్ పి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా పోలీసు అధికారులు గానీ సిబ్బంది గాని పోలీస్ ట్రైనింగ్ తర్వాత చాలామంది తన ఆశయాన్ని క్రమంగా మర్చిపోతూ పట్టుదల సడలిస్తారని, కానీ స్వాతి తన లక్ష్యం వైపు పైనుంచి కఠోర శ్రమతో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.