తిరుపతి ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనార్థమై తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టిసి బస్టాండ్ చేరుకున్న చెన్నైకి చెందిన చంద్రశేఖర్ కొడుకు అరుల్ మురుగన్ రెండేళ్ల బాలుడు కిడ్నాప్ గురైన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలోనూ ..సోషల్ మీడియాలోనూ బాలుడు కిడ్నాప్ గురైన విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో కిడ్నాపర్ భయపడ్డాడు. ఎక్కడ తానుదొరికిపోతానేమోనన్న భయంతో కిడ్నాప్ అయిన బాలుడిని తిరుపతి జిల్లా ఏర్పేడు లో ఉన్న తన అక్క వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
అప్పటికే సోషల్ మీడియాలో బాలుడు కిడ్నాప్ అయిన విషయాన్ని తెలుసుకున్న కిడ్నాపర్ అక్క కిడ్నాప్ గురైన బాలుడిని ముందుగా ఏర్పేడు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి బాలుడిని ఏర్పేడు పోలీసులకు అప్పగించారు. అనంతరం ఏర్పేడు పోలీసులు బాలుడిని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వద్దకు చేర్చారు.
దీంతో బాలుడి తల్లిదండ్రులను తన కార్యాలయం వద్దకు పిలిపించుకున్న ఎస్పీ పరమేశ్వర రెడ్డి మీడియా సమక్షంలో కిడ్నాప్ గురైన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన తమ బిడ్డను తిరిగి క్షేమంగా అప్పగించినందుకు ముందుగా తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగానికి, మా మొర ఆలకించి బిడ్డను తమ వద్దకు పంపించిన తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి రుణపడి ఉంటామని నమస్కరించి, అక్కడి నుంచి సంతోషంగా బిడ్డతో చెన్నైకి వెళ్లిపోయారు.