తిరుపతిలో పోలీసులతో సోదాలు
ఎయిర్ పోర్టుకు అయిదు మెయిల్స్
ప్రముఖ హోటళ్లకు మరో అయిదు బెదిరింపులు
రాజకీయ కుట్రలపై అనుమానాలు
కేసు దర్యాప్తులో పోలీసుల గోప్యం
అంతులేని ఆధారాలపై ప్రశ్నలెన్నో
భద్రతా చర్యల్లో లోపం లేదు
సీసీ కెమెరాలతో నిఘా తీవ్రతరం
భయాందోళన వద్దన తిరుపతి ఎస్సీ సుబ్బరాయుడు
ఆంధ్రప్రభ స్మార్ట్ , తిరుపతి ప్రతినిధి :
తిరుపతిలోని ప్రముఖ హోటళ్లకు.. అదీ విదేశీ భక్తుల విడిదిగా భావించే హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం నుంచి మొదలైన బాంబు బెదిరింపులు ఆదివారం కూడా కొనసాగాయి. తిరుపతి సిటీలోని రాజ్ పార్క్, వైశ్రాయ్ హోటళ్లకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి హోటళ్లతో పాటు ఆలయాలకు సైతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వరద రాజస్వామి ఆలయంతో పాటు కేటీ రోడ్డులోని ఆలయాల్లో బాంబు పెట్టినట్లు జాఫర్ సాధిక్ పేరుతో ఈ మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటళ్లు, ఆలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఎక్కడా బాంబు జాడ లేదు. శనివారం ఒకే రోజు రెండు హోటళ్లకు బెదిరింపు ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ వచ్చాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలోని రాజ్ పార్క్ హోటల్, పై వైస్రాయ్ హోటల్‌కు బాంబు బెదిరింపు రావడంతో అలిపిరి సీఐ రామ్ కిషోర్ బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గోవింద హైట్స్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. 150 బైపాస్ రోడ్డు తనపల్లి క్రాస్ సమీపంలోని తాజ్ హోటల్‌కు శనివారం బెదిరింపు కాల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఇక్కడా ఇదే కథ. బాంబు లేదు. అది ఫేక్ ఈ మెయిల్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు.
ఎయిర్ పోర్టుకే బెదిరింపులు
నెల రోజుల వ్యవధిలో ఐదు సార్లు తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. తాజాగా గురువారం తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి బాంబు బెదిరింపు మెస్సేజ్ వచ్చింది. ఆదమ్‌లాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం ఏమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఏర్పేడు సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ నెల 4న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై అధికారులు గోప్యం పాటించడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏర్పేడు పోలీసులకు తిరుపతి విమానాశ్రయ సీఐ ఎస్‌ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంతు దొరకని ఆధారాలు
సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రేణిగుంట విమానాశ్రయానికి ఐదు ఈ మెయిల్స్ వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపించారో గుర్తించే సమాచారం పోలీసులకు ఎందుకు అంతుబట్టటం లేదు. ఇక తిరుపతిలో రెండు ప్రముఖ హోటళ్లకే పదే పదే బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్, అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని హోటళ్లకు రెండు రెండు చొప్పున నాలుగు ఈ మెయిల్స్ వచ్చాయి. తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్ ఫరిదిలో మరో ఈ మెయిల్ వచ్చింది. ఈ ఫేక్ ఈ మెయిల్స్ పై ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేశారు. తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి ఆదమ్‌లాన్‌జా 333 పేరుతో ఎక్స్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. అసలు గుట్టును పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో? జనానికి అర్థం కావటం లేదు.
ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు..
ఈ రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జి ఉన్న చిన్న కుర్రాడు సైతం పోలీసు దర్యాప్తునే ప్రశ్నిస్తున్నాడు. ఒక ఈమెల్ వచ్చిందంటే… దాని జాడను కనుక్కోవటం అసాధ్యం కాదు. ఈమెయిల్ ఐపీ ఆధారంతో ఏ ప్రాంతం నుంచి, ఏ కంప్యూటర్ నుంచి మెయిల్ను సెంట్ చేశారో? ఇట్టే గ్రహించవచ్చు. ఇక ఈమెయిల్ అడ్రాసును క్రియేట్ చేసినప్పుడు ఖాతాదారుడి ఫోన్ నెంబర్ను గూగూల్ సేవ్ చేస్తుంది. ఫోన్ నెంబర్ లేకుండా ఈమెయిల్ ఐడీ క్రియేట్ కాదు. సరే.. తప్పుడు సిమ్లతో ఈ మెయిల్ క్రియేట్ చేసి తప్పించుకుంటే… ఆ సిమ్ లోకేషన్ ను ఇట్టే గుర్తించవచ్చు.
ఒకవేళ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంటే.. పదే పదే ఒకే ఈమెయిల్ సెంట్ చేస్తున్న కంప్యూటర్ జాడ తెలుసుకోలేరా? ల్యాప్ ట్యాప్ నుంచి పంపిస్తే.. ల్యాప్ ట్యాప్ ఎక్కడుందో? గుర్తించలేరా? ఇక్కడ బాంబు బెదిరింపులను ఇలా తేలిగ్గా వదిలేస్తే… రేపు బాంబు జాడ తెలిసినా.. ఇది ఫేక్ అని వదిలేస్తే, జరిగే నష్టం అంచనా వేయనట్టేనని జనం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారం టెర్రరిస్టుల పని కాకపోతే.. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? నకిలీ లడ్డూ వ్యవహారాన్ని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందా? లేక ఏపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన.. అన్నాచెల్లిళ్ల ఆస్తి బంధన్ కథను రూటు మార్చేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకువచ్చారా? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
దర్యాప్తులో వేగం పెంచాం..
= తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు
తిరుపతిలో బాంబు బెదిరింపు అలజడులకు భయపడొద్దని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నామని వివరించారు. తిరుపతి నగరంలో భద్రత పెంచామని, నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికపై నిఘా ఉందన్నారు. బెదిరింపులు వచ్చిన అన్ని హోటళ్లలో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టామని, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదని, ఫేక్ మెయిల్స్ పై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సహకారంతో ట్రెండి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు.