తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : ప్రస్తుత చంద్రగిరి ఎం ఎల్ ఏ పులివర్తి నాని పై దాడికి సంబంధించిన కేసులో నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు వై సి పి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు లో పలు నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి. నిన్నరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు ఈ రోజు స్థానిక యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి 41 ఏ నోటీసు ఇచ్చి పంపించివేశారు. అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మోహిత్ రెడ్డి తండ్రి మాజీ ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు సహచరులతో చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది . నిన్నటి వరకు ఇంటిలోనే ఉండి ఒక మిత్రుడి పెళ్ళికి వెళ్లి మళ్ళీ రావడానికి దుబాయ్ వెళ్తున్న తనపై తీవ్రవాది లాగా లుక్ అవుట్ నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకురావడమేమిటని మోహిత్ రెడ్డి తీవ్రంగా అంటున్నారు. దీనిపై అధికారికంగా అధికారికంగా కోరువిప్పకున్నా పోలీసు అధికారులు మాత్రం కేసు విచారణ దశలో విదేశాలకు వెళ్తే కష్టమనే చట్ట ప్రకారం వ్యవహరించామని అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల్లో పలు రకాల కారణాల నేపథ్యంలో ప్రధాన పోటీ దారులైన పులివర్తి నాని (తెలుగుదేశం), మోహిత్ రెడ్డి (వై సి పి ) ల నడుమ పోరు నువ్వా నేనా అన్నట్టుగానే జరిగింది నామినేషన్ దాఖలు చేసే దశలోనే చోటు చేసుకున్న తోపులాటలు, దాడులు ప్రతిదాడులు ఎన్నికల తీవ్రతకు అద్దం పట్టాయి. పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగినా ఆ రోజు రాత్రి కూచువారిపల్లె రెండు పార్టీల నడుమ ఘర్షణలకు వేదికైంది ఆ ఘర్షణల్లో వైసీపి వర్గీయుడి పై తీవ్ర దాడులు, వారి ఇంటిని ధ్వంసం చేయడం వంటి ఘటనలతో పాటు మోహిత్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహాలు దగ్ధం అయ్యాయి మరుసటి రోజు తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్తున్న నాని తదితరులను వై సి పి వర్గాలు నిలదీయడానికి చేసిన ప్రయత్నం ఉద్రిక్తవాతావరణానికి కారణమైంది .
ఆ దశలో గాయపడి ఆసుపత్రి పాలైన నాని తనపై హత్యాయత్నం చేశారని కేసులు నమోదు చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు దాదాపు 100 మందిని అదుపులో తీసుకుని విచారించారు, తరువాత దశలో 34 మంది వై సి పి నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపారు . ఎన్నికల్లో అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తో పాటు ఇటు పులివర్తి నాని గెలుపొందడం తో కేసు విచారణ ఊపందుకుంది . ఇదిలావుండగా ఆ సందర్భంగా నాని పై ఎటువంటి దాడి జరగనే లేదని, ఆయన్ని చికిత్స చేసుకోడానికి చేరిన ఆసుపత్రి అధికారులు రిపోర్టులను చూపిస్తూ వై సి పి అభ్యర్థి మోహిత్ తండ్రి మాజీ ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర రెడ్డి తమ సహచరులపై తప్పదు కేసులు పెట్టారని కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు,. పైగా నాని పై దాడి చేశారని చెబుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రం లో అధికారులతో ఉన్న మోహిత్ రెడ్డి పై దాదాపు 50 రోజుల తరువాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అయితే కేవలం ఒక పధకం ప్రకారం తనను చంపడానికె మోహిత్ రెడ్డి నేతృత్వంలో ప్రయత్నం జరిగిందని పులివర్తి నాని ఆరోపణలను చేశారు.
ఈ క్రమంలో మొదలైన మాటల యుద్ధం పార్టీ రాజకీయాలను దాటి వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకునే దశకు చేరుకుంది . మధ్యలో తనను అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ పొందడానికి మోహిత్ రెడ్డి చేసిన యత్నం ఫలించలేదు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఇతర మద్దతు దారుల పై తెలుగుదేశం వర్గాలు దాడులు చేస్తున్నారని భాస్కర రెడ్డి, మోహిత్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో దుబాయ్ లు తన మిత్రుడి పెళ్ళికి హాజరు అయి మరో రెండు రోజుల్లో తిరిగి వచ్చి షిరిడీ యాత్రకు సన్నిహితులతో వెళ్ళడానికి మోహిత్ రెడ్డి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నిన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన విదేశాలకు పారిపోతున్నారనే అనుమానంతో లుక్ అవుట్ నోటీసు జారే చేసిన తిరుపతి డి ఎస్ పి తమ సిబ్బందితో బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లి మోహిత్ ని అదుపులో తీసుకున్నారు. అక్కడి పోలీసు స్టేషన్లో విచారించి ఈ రోజు ఉదయం తిరుపతిలోని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారు. పోలీసులు అదుపులో తీసుకున్నప్పటినుంచి ఆందోలన వ్యక్తం చేస్తున్న భాస్కర రెడ్డి తమ సహచరులతో యూనివర్సిటీ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన తన కొడుకును వీధి పోరాటాలు చేసేవిధంగా తయారు చేస్తున్నారని అన్నారు. పోలీసు స్టేషన్ కు చేరుకున్న తరువాత మోహిత్ రెడ్డి కి 41 ఏ కింద నోటీసు ఇచ్చి విదేశాలకు పోరాదని, తమకు చెప్పకుండా ఎక్కాడు పోవద్దని హెచ్చరించి వదిలివేశారు.
బయటకు వచ్చిన మోహిత్ రెడ్డి తనకు సంబంధం లేని కేసులో ఘటన జరిగిన 50 రోజుల తరువాత తన పేరును ఎఫ్ ఐ ఆర్ లో చేర్చి ఒక పధకం ప్రకారం వేధించడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలు , బాధితుల తరపున పోరాడుతూ న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. జనం మధ్యలోనే ఉన్న తనను తీవ్రవాదికి ఇచ్చినట్టు లుక్ అవుట్ నోటీసు తో అరెస్ట్ చేయడం, రెండురోజుల్లో తిరిగి రావడానికి రిజర్వ్ చేసుకున్న టికెట్ చూపించినా పట్టించుకోక పోవడం అక్రమంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో మాట్లాడేందుకు అంగీకరించని పోలీసు అధికారులు ఒక హత్యా యత్నం కేసు విచారణలో నిందితులలో ఒకరైన మోహిత్ రెడ్డి విదేశాలకు పారి పోతున్నారనే అనుమానంతో అరెస్ట్ చేసి చట్ట ప్రకారం 41 ఏ నోటీసు ఇచ్చామనే ధీమా మాత్రం వ్యక్తం అవుతోంది . మొత్తంమీద దాదాపు నిన్నటి రాత్రి నుంచి కొనసాగుతున్న ఉత్కంఠ భరిత నాటకీయ పరిణామాలకు ఈరోజు ఉదయం మోహిత్ విడుదలతో ప్రస్తుతానికి తా త్కాలికంగా తెరపడిందని చెప్పుకోవాలి, .