తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం భక్తులు కోట్లాడి రూపాయలను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తుండడంతో గత కొద్ది నెలలుగా స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించడంతో 2022–23 ఆర్దిక సంవత్సరానికి టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా స్వామివారికి రికార్డు స్థాయిలో 1520 కోట్ల 18 లక్షల ఆదాయం హుండీద్వారా లభించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతో టిటిడికి ప్రతినిత్యం మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. గతంలో కోవిడ్ కారణంగా 2020-2021 సంవత్సరాలలో రెండేళ్ళపాటు శ్రీవారి దర్శనానికి టిటిడి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో స్వామివారికి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2022 వ సంవత్సరం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతేడాది మార్చి నెల నుంచి శ్రీవారి దర్శనానికి కోవిడ్‌కు పూర్వం ఉన్న విధానంలోనే టిటిడి భక్తులను అనుమతిస్తుండడంతో ఏడాదిగా హుండీ ద్వారా శ్రీవారికి లభిస్తున్న ఆదాయం భారీగా పెరిగింది.
కాగా శ్రీవారికి ప్రతినిత్యం సరాసరి నాలుగు కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం లభిస్తోంది. దీంతో గతేడాది ఏప్రిల్ నెలలో 127 కోట్ల 63 లక్షల ఆదాయం లభించింది. ఇక మేనెలలో 129 కోట్ల 93 లక్షల రూపాయల ఆదాయం స్వామివారికి లభించగా జూన్ మాసంలో 123 కోట్ల 73 లక్షల ఆదాయం లభించింది. ఇక జూలై నెలలో 139 కోట్ల 46 లక్షల రూపాయల ఆదాయం లభిస్తే ఆగస్టు నెలలో టిటిడికి చరిత్రలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 140 కోట్ల 7 లక్షల రూపాయల ఆదాయం లభించింది. సెప్టెంబర్ నెలలో 122 కోట్ల 69 లక్షల రూపాయల ఆదాయం లభిస్తే అక్టోబర్ నెలలో 122 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయం లభించింది. నవంబర్ నెలలో 127 కోట్ల 30 లక్షల రూపాయల ఆదాయం లభిస్తే డిసెంబర్ నెలలో 129 కోట్ల 49 లక్షల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఈ సంవత్సరం జనవరి మాసంలో 123 కోట్ల 4 లక్షల రూపాయల ఆదాయం లభించగా ఫిబ్రవరి నెలలో 114 కోట్ల 29 లక్షల ఆదాయం లభించింది. ఇక గత నెల మార్చి నెలలో 120 కోట్ల 29 లక్షల రూపాయల ఆదాయం లభించింది.
దీంతో గత ఆర్దిక సంవత్సరానికి గాను స్వామివారికి 1520 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం లభించింది. గతంలో శ్రీవారి వార్షిక హుండీ ఆదాయం 1200 కోట్లు మాత్రమే ఉండడంతో 2022-23 సంవత్సరానికి శ్రీవారికి హుండీ ద్వారా 1000 కోట్ల ఆదాయం లభిస్తుందని టిటిడి అధికారులు అంచనా వేయగా గత కొద్దినెలలుగా శ్రీవారికి ప్రతినెలా 100 కోట్లకు పైగా ఆదాయం లభించడంతో టిటిడి చరిత్రలోకే మొట్టమొదటిసారి గత ఆర్దిక సంవత్సరంలో శ్రీవారికి హుండీ ఆదాయం 1500 కోట్ల మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. గత ఆర్దిక సంవత్సరంలో పలుమార్లు శ్రీవారికి రోజువారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో లభించింది. ఈ ఏడాది ఆంగ్లనూతన సంవత్సరాది రోజున టిటిడి చరిత్రలోకే అత్యధికంగా 7.68 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఒక్కరోజే ఇంతపెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. 2020-23 వ సంవత్సరంలో టిటిడి అంచనాలు తల్లక్రిందులై హుండీ ద్వారా గణనీయంగా ఆదాయం లభించడంతో రాబోవు 2023-24 ఆర్దిక సంవత్సరానికి హుండీ ద్వారా 1591 కోట్ల ఆదాయం లభిస్తుందని బడ్జెట్లో టిటిడి అంచనావేసింది.