Sunday, September 22, 2024

Tirumala ఆలయ పవిత్రతను కాపాడటంలో రాజీ ప్రసక్తే లేదు –

అన్ని ఆలయాల్లోనూ సంప్రోక్షణ

రేపు మ‌హాశాంతి యాగం నిర్వ‌హ‌ణ‌

ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు

లడ్డూ వ్యవహారంపై ఈవో నివేదిక అందజేత

బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం

- Advertisement -

ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుమల :తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న విషయంపై మంత్రులు, ఉన్నతాధికారులు, టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రాథమిక నివేదికను అందించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించారు.

శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ

తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరిన్ని సంప్రదింపులు జరిగాకే సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లోనైనా కచ్చితంగా అదే వర్గానికి చెందిన సిబ్బంది ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

రేపు మహా శాంతి యాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు మహా శాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు ఈ హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.

ముందుగా మహశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికీ నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.

బ్రహ్మోత్సవాలకి చంద్రబాబుకు ఆహ్వానం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి…బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement