తిరుమల – వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కొన్ని మీడియాలలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.. సోషల్ మీడియాలో సైతం ఘటనపై వాస్తవాలు వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారని మండి పడ్డారు. తిరుమలలోని తన ఛాంబర్ లో ఆయన నేడు ఈవో శ్యామలారావుతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 8న దురదృష్టకర సంఘటన జరిగిందని…అది చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు గాయపడి చికిత్స పొంది కోలుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వస్థలాలకు పంపించామన్నారు.
టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని… మరో 20 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను భక్తులు నమ్మొద్దని తెలిపారు. కొంత మంది పనిగట్టుకొని తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వాస్తవం తెలుసుకొని వార్తలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నానని బిఆర్ నాయుడు పేర్కొన్నారు.
చైర్మన్ తో విబేధాలు లేవు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఛైర్మనే కీలకమని పాలకమండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో కొన్ని లోపాలు జరిగాయని అన్నారు. అయితే చైర్మన్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని.. గత ఆరు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. మొన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారుర. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.