Friday, September 27, 2024

Tirumala – డిక్ల‌రేష‌న్ పై జ‌గ‌న్ మౌనం… తిరుమ‌ల‌లో హైటెన్ష‌న్ …

తిరుప‌తి – వైసీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం తిరుమలకు వెళుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు, క్రైస్తవుడైన జగన్ అందరు అన్యమతస్తుల మాదిరే శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయాలని స్వామీజీలు, హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని అంటున్నారు.

చ‌ట్ట‌ప్ర‌కారమే ముందుకు

అయితే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే వైఎస్ జగన్ నుంచీ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముందుగానే అతిధి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతిస్తారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఒక్క‌సారి కూడా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌ని జ‌గ‌న్ ..

గతంలో పలు మార్లు జగన్ డిక్లరేషన్ పై హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోలేదు. అయిదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయాల్లో టీటీడీ అధికారులు ఎవ్వరూ డిక్లరేషన్ గురించి అడగలేదు. ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ వివాదం రాజుకుంది. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతనే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరో వైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ అంశంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. .

డిక్ల‌రేష‌న్ పై జ‌గ‌న్ మౌనం..

ఓవైపు ఇంత జరుగుతున్నా… డిక్లరేషన్ పై జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో, జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement