తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ… శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. చక్కటి వర్షాలు కురిసి.. పాడిపంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. నదులు పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.