తిరుమలలో శ్రీవారు ,అమ్మవారు ప్రణయ కలహ మహోత్సవాన్ని గత రాత్రి ఘనంగా నిర్వహించారు… ఈ కలహ ప్రణయాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.. ముందుగా మలయప్పస్వామి వారు పల్లకీ ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జీయ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు.
ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు.. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా -స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. కాగా ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి తోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.