Friday, November 22, 2024

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు.. 12 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయం అలంకరణ

తిరుమల, ప్రభన్యూస్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి ఇప్పిటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సోమవారం శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వేకువజామున ఒంటిగంటకే శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. సోమవారం నుంచి 10 రోజులపాటు టిటిడి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం కోసం సామాన్యులే కాక విఐపిలు పెద్ద సంఖ్యలో తిరుమలకు రానున్నారు. కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలసివున్న పుణ్యక్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఏడాదికి 10 రోజులపాటు మాత్రమే ఆలయంలో తెరిచివుంటే వైకుంఠద్వార దర్శనంకోసం సామాన్య భక్తులే కాక విఐపిలు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. సోమవారం నుంచి 11 వ తేది వరకు వైకుంఠద్వారాలను తెరిచి భక్తులకు వైకుంఠద్వార దర్శనం టిటిడి కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే మోక్షం సిద్దిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. దీంతో వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు భారీగానే తరలివస్తారు.

కాగా మహావిష్ణువుకు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. దీంతో ధనుర్మాసం నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాలలో 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తరద్వారం ద్వారా వెలుపలికి వచ్చి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారికి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తరద్వారం లేదు. స్వామివారి ఆనందనిలయంలోనే రెండు ప్రాకారాలు ఉన్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో ఆరడుగులదూరంలో ఉన్న ఆనందనిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన శ్రీవారి భక్తులను ఈ వైకుంఠద్వారంలోనే టిటిడి అనుమతిస్తుంది. దీంతో వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం మరింతమంది భక్తులకు కలగనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి స్వర్ణథం పై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ద్వాదశి పర్వదినం రోజు వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశినాడు ముల్లోకాలలో ఉన్న పుణ్యనదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయట.

ఆనాడు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. దాదాపు 12 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను పుష్పాలతో పాటు వివిధ రకాల పండ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఇలవైకుంఠాన్ని తలపించేలా విద్యుత్‌ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయే విధంగా విద్యుత్‌శాఖ సిబ్బంది ఆలయంతో పాటు ప్రధాన రహదారులను తీర్చిదిద్దారు. కాగా గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేకువజామున 12.5 గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరిచి పూజాది కార్యక్రమాలను పూర్తిచేసి ఒంటిగంటకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. విఐపిల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథిగృహం ప్రాంతంలోని సన్నిధానం, వెంకటకళానిలయం, మాతృశ్రీవకుళాదేవి అతిథిగృహం, నారాయణగిరి అతిథిగృహాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి వారికి అక్కడే వసతి, దర్శన టికెట్లను జారీచేసేవిధంగా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే 6 టికెట్లు, అధికారులకు 4 టికెట్లను జారీ చేయనున్నారు. వైకుంఠద్వార దర్శనం కోసం పలువురు ప్రముఖులు తిరుమలకు వస్తున్నట్లు టిటిడికి ఇప్పటికే సమాచారం అందించారు. న్యాయమూర్తులతో పాటు కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కార్పోరేషన్‌ చైర్మన్‌ వస్తున్నట్లు టిటిడి సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకాదశి పర్వదినాన ముందుగా విఐపి దర్శనాలను ప్రారంభించి పరిమిత సంఖ్యకఆ పాస్‌లను జారీ చేసి, ఉదయం 6 గంటల నుంచి టైంస్లాట్‌ టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించేవిధంగా టిటిడి ఏర్పాట్లు చేసింది. ఇక ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టిటిడి పూర్తిగా రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement