Saturday, November 23, 2024

ప్రపంచంలోనే టాప్‌-1గా తిరుమల మ్యూజియం.. డిసెంబర్‌ నాటికి ఆటోమేటిక్‌ లడ్డూ యంత్రాల ఏర్పాటు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబర్‌ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్‌-1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్‌ నాటికి సిద్దం చేస్తామని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ, తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి హుండీ లెక్కింపు ప్రారంభిస్తామని, నాణేల లెక్కింపు కోసం అధునాతమనైన యంత్రాలను జర్మనీ నుంచి తీసుకువస్తున్నామని, అవి రాగానే ఇక పై శ్రీవారి హుండీ కానుకల లెక్కింపును పూర్తిస్థాయిలో తిరుమలలోనే నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

కాగా తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో తేదిని నిర్ణయించి తెలియజేస్తామని తెలిపారు. ఇక భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీదేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించామని తెలిపారు. ఈ యాప్‌లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారిసేవ బుక్‌ చేసుకోవడంతో పాటు విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్స్‌ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని తెలిపారు.

అలాగే యువత ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు రేపు, ఎల్లుండి తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తున్నామని, దాదాపు 2 వేలమంది యువతీ, యువకులు పాల్గొంటారని తెలిపారు. ఇక జనవరి నెలలో 20.78 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.123.07 కోట్లు, లడ్డూల విక్రయం ద్వారా రూ.1.07 కోట్లు అని, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 37.38 లక్షలు కాగా శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.51 లక్షల అని ఈవో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement